వాళ్లిద్దరికీ బ్యాటింగ్ గుర్తుకొస్తుందా?
ఈ సీజన్‌లో భారత జట్టు మంచి విజయాలు సాధిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు రంగాల్లోనూ టీమిండియా ప్రతిభ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ మూడు రంగాల్లో కూడా కొంతమంది మెరుపులు మెరిపిస్తుంటే మరికొందరు మాత్రం అంతంత మాత్రం ప్రదర్శనతో చూసేవాళ్లకు నీరసం తెప్పిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా ఓపెనర్ల ద్వయం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల బ్యాటింగ్ చూస్తుంటే అసలు వీళ్లకు బ్యాటింగ్ చేయడం గుర్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టి20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్‌లోనూ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడినట్లు చెప్పుకోడానికి లేదు. పైగా.. ఏమైనా అద్భుతమైన బాల్స్‌కు ఔటయ్యారా అంటే అదీ లేదు. దాదాపు ప్రతిసారీ చెత్తషాట్లకు ప్రయత్నించడం.. పెవిలియన్ బాట పట్టడం.
ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మకు చాలా మంచి రికార్డు ఉందని, ఆ జట్టుమీదే తన డబుల్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడని అతడి అభిమానులు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు సంబరపడ్డారు. ఇన్నాళ్లూ ఎలా ఉన్నా, ఈ మ్యాచ్‌తో అతడి ఫామ్ తిరిగొస్తుందని చాలా ఆశించారు. కానీ, పరిస్థితి యథాతథం. శిఖర్ ధావన్ కూడా అంతే. ఉన్న కాసేపు ధాటిగానే బ్యాటింగ్ చేస్తున్నా, దాన్ని భారీ స్కోరు దిశగా మాత్రం తీసుకెళ్లడంలో ఇద్దరూ విఫలం అవుతున్నారు.
మిగిలిన జట్లన్నీ పవర్ ప్లే ఆరు ఓవర్లలో 50 నుంచి 70 వరకు పరుగులు పిండుకుంటుంటే, భారత ఓపెనర్లు మాత్రం ఆ సమయంలో ఉండే ఫీల్డింగ్ నిబంధనలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే గట్టి పునాది పడితే.. ఆ తర్వాత వచ్చే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పని సులభం అవుతుంది. విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడం వల్ల ఇన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాం. అయితే ప్రతిసారీ ఒకే బ్యాట్స్‌మన్ మీద భారం మోపడం కూడా సరికాదు.
ఇదే విషయాన్ని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా జట్టు సభ్యులందరికీ స్పష్టంగా చెప్పాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్.. ముఖ్యంగా ఓపెనర్లు తమ బ్యాట్లు ఝళిపించాలని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అవతల ఉన్నది చాలామంది గట్టి బ్యాట్స్‌మన్ ఉన్న వెస్టిండీస్ లాంటి జట్టు అయినా.. ఐపీఎల్ పుణ్యమాని వాళ్లలో చాలామంది ఆటతీరు తెలుసు కాబట్టి, మన ఓపెనర్లు ఇప్పటికైనా మళ్లీ తమ పాత బ్యాటింగ్ నైపుణ్యాలను గుర్తుకు తెచ్చుకుని.. చకచకా తలో హాఫ్ సెంచరీ చేస్తే భారత జట్టు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.