గోల్కొండ, న్యూస్‌లైన్: క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం కృషిచేస్తున్న ఉద్యమకారులకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మద్దతు ప్రకటించింది. ఆదివారం గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ క్రుసేడర్స్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను క్యాన్సర్ బాధితుల చికిత్సకు కేటాయించడం హర్షణీయమని తెలిపింది. క్యాన్సర్ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, నేడు ఆ వ్యాధిని సకాలంలో గుర్తించి నివారించే ఆధునిక చికిత్స విధానం అందుబాటులోకి వచ్చిందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. క్యాన్సర్ కోసం స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు,సెలబ్రిటీలు, క్రీడాకారులు ముందుకు రావడం హర్షణీయమని తెలిపింది.
కేవలం గోల్ఫ్ క్రీడాకారులే కాకుండా ఇతర రంగాల క్రీడాకారులు కూడా ఇటువంటి టోర్నమెంట్‌లు నిర్వహించి క్యాన్సర్ ఫౌండేషన్లకు విరివిగా నిధులు సమకూర్చాలని సానియా కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ క్రుసేడర్ 800 మంది పిల్లలకు క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం నిధులు అందించిందని, ఇది ఎంతో గొప్ప విషయమని అభినందించింది. కాగా ఈ గోల్ఫ్ టోర్నమెంట్ ఈ నెల 15, 16వ తేదీల్లో హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో జరుగనుందని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి బి.ఎల్.కె.రెడ్డి తెలిపారు. ఇందులో దాదాపు 150 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.
సెలబ్రిటీస్ ప్లే ఆఫ్‌లో 16న జరిగే పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, గుత్తా జ్వాల, క్లాసికల్ డాన్సర్ పింకీ రెడ్డి, ఆనంద్ శంకర్ జయంత్ తదితర ప్రముఖులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్ అసదుల్లా, క్యాన్సర్ క్రుసేడర్స్, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, సైబర్ సిటీ బిల్డర్స్-డెవలప్‌మెంట్, ఇన్‌లైన్ ఫోర్ మోటార్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌ను గుర్తిస్తే నివారణ సులభమే: సానియా
Published Mon, Feb 3 2014 12:10 AM | Last Updated on Tue, Aug 21 2018 3:10 PM
Advertisement
Advertisement