
న్యూఢిల్లీ: వివిధ వేదికలపై పతకాలతో సత్తా చాటుతూ, భారత కీర్తి పతాకను ఎగురేస్తున్న రెజర్లకు తీపి కబురు. ఇప్పటి వరకు క్రికెట్ వంటి క్రీడల్లోనే ఉన్న వార్షిక సెంట్రల్ కాంట్రాక్టును త్వరలో వీరికీ వర్తింపజేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది రెజ్లర్లు ఈ కాంట్రాక్టు పరిధిలోకి రానున్నారు. ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు కేటగిరీలుగా విభజించి వర్తింపజేయనున్న కాంట్రాక్టులో రెజ్లర్లకు ఏడాదికి గరిష్ఠంగా రూ.30 లక్షలు, కనిష్టంగా రూ.30 వేలు ఇస్తారు.
మంగళవారం ఢిల్లీలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2తో ముగియనున్న జాతీయ సీనియర్ పోటీల అనంతరం కాంట్రాక్టు అమలు చేయనున్నారు. రెజ్లర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మున్ముందు మరికొందరు ఈ క్రీడ పట్ల మొగ్గుచూపేందుకు ఇది ఉప యోగపడుతుందని సమాఖ్య భావిస్తోంది.