Bajrangi
-
పంజాబ్ రాయల్స్ బోణీ
లుథియానా: డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్ ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. నిర్ణాయక బౌట్లో కామన్వెల్త్, ఆసియా క్రీడల చాంపియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు) 9–0తో ఆండ్రి క్విట్కోస్కీను ఓడించి పంజాబ్‌ను విజేతగా నిలిపాడు. అంతకుముందు జరిగిన బౌట్లలో వినోద్ (74 కేజీలు) 0–14తో ఢిల్లీ రెజ్లర్ కెటిక్ సబలోవ్ చేతిలో కంగుతినగా, మహిళల 76 కేజీల విభాగంలో వెస్కన్ సింతియా 2–1తో శుస్తోవా అనస్తాసియా (ఢిల్లీ)పై గెలిచింది. 86 కేజీల్లో డటో మర్సగిష్విలి 12–0తో ప్రవీణ్ రాణా (ఢిల్లీ)పై నెగ్గగా, మహిళల 53 కేజీల్లో పింకీ (ఢిల్లీ) 9–4 అంజును ఓడించింది. కొరే జార్విస్ (125 కేజీలు) 7–2తో సతిందర్ మలిక్ (ఢిల్లీ)పై విజయం సాధించగా, అనిత 0–11తో సాక్షి మలిక్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది. చివరి దాకా ఇరు జట్లు చెరోటి గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో బజరంగ్ ‘పట్టు’ పట్టడంతో పంజాబ్ ఖాతా తెరిచింది. -
రెజ్లర్లకూ కాంట్రాక్టులు
గొండా: భారత్‌లో క్రికెటర్లే కాదు... రెజ్లర్లూ కాంట్రాక్టు ‘పట్టే’శారు. ఇప్పటిదాకా గెలిచినపుడే పతకాలు, ప్రోత్సాహకాలు దక్కేవి. ఇకపై వార్షిక కాంట్రాక్టుల రూపంలో స్థిరమైన మొత్తాలను అందుకోనున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్తగా ఈ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంటాబయటా పతకాలు సాధిస్తున్న రెజ్లర్లకు ‘ఎ’, ‘బి’ కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎ–గ్రేడ్‌లో రూ. 30 లక్షలు, బి–గ్రేడ్‌లో రూ. 20 లక్షలు వార్షిక ఫీజుగా చెల్లిస్తారు. సి, డి గ్రేడ్‌ల్లో ఉన్న రెజ్లర్లకు వరుసగా రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలు చెల్లిస్తారు. ఏటా ఆయా రెజ్లర్ల ప్రదర్శనను సమీక్షించి గ్రేడ్లను మారుస్తారు. ఈ కాంట్రాక్టుల్లో యువ స్టార్ రెజ్లర్లకు పెద్దపీట వేశారు. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజ ధండాలకు ‘ఎ’ గ్రేడ్ ఇవ్వగా... వెటరన్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత అయిన సుశీల్ కుమార్‌కు ‘బి’ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇదే జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ ఉంది. దేశంలో బీసీసీఐ తర్వాత కాంట్రాక్టు ఇస్తున్న రెండో క్రీడా సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐనే! భారత ఒలింపిక్ సంఘం సభ్య సమాఖ్యల్లో కాంట్రాక్టులు చెల్లిస్తున్న ఏకైక క్రీడా సంఘంగా డబ్ల్యూఎఫ్ఐ ఘనతకెక్కనుంది. జూనియర్ రెజ్లర్లకు ఇదెంతో ప్రోత్సాహకరమని వినేశ్ ఫొగాట్ హర్షం వ్యక్తం చేసింది. -
పట్నా పైరేట్స్ ఐదో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 50–30తో గెలిచింది. ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ 11, దీపక్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగారు. ఈ మ్యాచ్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్నేహితులతో కలిసి వీక్షించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 38–36తో యు ముంబాపై విజయం సాధించింది. -
మన బజరంగ్... ప్రపంచ నంబర్‌వన్
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందిన అతను తాజాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ 65 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో ఏ భారతీయ రెజ్లర్ కూడా నంబర్‌వన్ ర్యాంక్ సాధించలేదు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ 96 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తోబియర్ (క్యూబా–66 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో... చకయెవ్ (రష్యా–62 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. -
భారత రెజ్లర్లకూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు
న్యూఢిల్లీ: వివిధ వేదికలపై పతకాలతో సత్తా చాటుతూ, భారత కీర్తి పతాకను ఎగురేస్తున్న రెజర్లకు తీపి కబురు. ఇప్పటి వరకు క్రికెట్ వంటి క్రీడల్లోనే ఉన్న వార్షిక సెంట్రల్ కాంట్రాక్టును త్వరలో వీరికీ వర్తింపజేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది రెజ్లర్లు ఈ కాంట్రాక్టు పరిధిలోకి రానున్నారు. ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు కేటగిరీలుగా విభజించి వర్తింపజేయనున్న కాంట్రాక్టులో రెజ్లర్లకు ఏడాదికి గరిష్ఠంగా రూ.30 లక్షలు, కనిష్టంగా రూ.30 వేలు ఇస్తారు. మంగళవారం ఢిల్లీలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2తో ముగియనున్న జాతీయ సీనియర్ పోటీల అనంతరం కాంట్రాక్టు అమలు చేయనున్నారు. రెజ్లర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మున్ముందు మరికొందరు ఈ క్రీడ పట్ల మొగ్గుచూపేందుకు ఇది ఉప యోగపడుతుందని సమాఖ్య భావిస్తోంది. -
బజరంగ్‌పైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి జోరు మీదున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ (65 కేజీలు)... పసిడి పతకమే లక్ష్యంగా ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నాడు. నేటి నుంచి ఈనెల 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో 30 మంది సభ్యులుగల భారత బృందం పోటీ పడనుంది. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) పతకం తెచ్చే అవకాశముంది. -
బజరంగ్, వినోద్లకు రజతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పోలాండ్‌లో ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్స్‌లో బజరంగ్ 7–16తో నచిన్ సెర్గీవిచ్ కులర్ (రష్యా) చేతిలో... వినోద్ 1–3తో రిచర్డ్ ఆంథోనీ లూయిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. సెమీఫైనల్స్‌లో బజరంగ్ 9–4తో అలీ అక్బర్ (ఇరాన్)పై, వినోద్ 2–1తో తొకోజిమా (జపాన్)పై గెలిచారు. -
లవ్‌లో పడిపోయా....
ముంబై: బజరంగీ భాయిజాన్ సినిమా చూసి బాలీవుడ్ సినిమాతో లవ్‌లో పడిపోయానని ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాను చూసిన ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. సినిమా చాలా బావుందని, ఈ సినిమా చూశాక, హిందీ సినిమాపై ప్రేమ, అభిమానం కలిగాయని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు కబీర్ ఖాన్, హీరో సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీలకు తన అభినందనలు తెలిపారు. లెసన్స్ ఆఫ్ లవ్ పేరుతో సోషల్ మీడియాలో తన భావాలను పంచుకోవడం, ట్విట్టర్ లో తరచూ కమెంట్లు షేర్ చేయడం ఈ దర్శకుడికి అలవాటు. అయితే విభిన్న కథాంశాలతో రూపొందించిన మాసూమ్, మిస్టర్ ఇండియా, బండిట్ క్వీన్, ఎలిజబెత్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శేఖర్ కపూర్. ఇపుడు ఈ విశ్వదర్శకుడి ప్రశంసలతో బజరంగీ భాయిజాన్ ప్రతిష్ట మరింత పెరిగినట్టయింది. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్, కరీనా జంటగా రూపొందిన బజరంగీ భాయిజాన్ చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఒక బిజినెస్ పరంగానే కాకుండా, అనేక కోణాల్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా బాలనటి హర్షాలీ మంచి మార్కులు కొట్టేస్తోంది. Fell in love with Hindi cinema all over again after watching #BajrangiBhaijaan Congratulations @BeingSalmanKhan @kabirkhankk @Nawazuddin_S — Shekhar Kapur (@shekharkapur) July 25, 2015