
లుథియానా: డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్ ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో ఢిల్లీ సుల్తాన్స్‌పై గెలుపొందింది. నిర్ణాయక బౌట్‌లో కామన్వెల్త్, ఆసియా క్రీడల చాంపియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు) 9–0తో ఆండ్రి క్విట్కోస్కీను ఓడించి పంజాబ్‌ను విజేతగా నిలిపాడు. అంతకుముందు జరిగిన బౌట్లలో వినోద్ (74 కేజీలు) 0–14తో ఢిల్లీ రెజ్లర్ కెటిక్ సబలోవ్ చేతిలో కంగుతినగా, మహిళల 76 కేజీల విభాగంలో వెస్కన్ సింతియా 2–1తో శుస్తోవా అనస్తాసియా (ఢిల్లీ)పై గెలిచింది.
86 కేజీల్లో డటో మర్సగిష్విలి 12–0తో ప్రవీణ్ రాణా (ఢిల్లీ)పై నెగ్గగా, మహిళల 53 కేజీల్లో పింకీ (ఢిల్లీ) 9–4 అంజును ఓడించింది. కొరే జార్విస్ (125 కేజీలు) 7–2తో సతిందర్ మలిక్ (ఢిల్లీ)పై విజయం సాధించగా, అనిత 0–11తో సాక్షి మలిక్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది. చివరి దాకా ఇరు జట్లు చెరోటి గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో బజరంగ్ ‘పట్టు’ పట్టడంతో పంజాబ్ ఖాతా తెరిచింది.