
కోల్‌కతా: ప్రస్తుతం దక్షిణాఫ్రికా వెళ్లనున్న అయిదుగురు పేస్ బౌలర్ల బృందం ఆ దేశంలో గతంలో పర్యటించిన భారత ఫాస్ట్ బౌలింగ్ బృందంతో పోలిస్తే అత్యుత్తమమైనదని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాంత్, ఉమేశ్, షమీ, భుమీ, బుమ్రాలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకత చూపగలిగినవారేనని వివరించాడు. ‘ప్రత్యర్థి బౌలింగ్ గురించి మాట్లాడను. మనవైపు మాత్రం విభిన్న వనరులున్నాయి. ఉమేశ్, షమీ 140 కి.మీ. వేగంతో బంతులేస్తూ స్వింగూ చేయగలరు.
భువీ మంచి స్వింగ్ బౌలర్. బుమ్రా వైవిధ్యం చూపుతాడు. ఇషాంత్ ఎలాగూ ఉన్నాడు. వీరికి హార్దిక్ అదనపు బలమవుతాడు. స్వదేశంలో విజయాలు సాధించి వెళ్తుండటం ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దీనికితోడు మంచి జట్టు, అన్నిటికి మించి నంబర్ 1 టెస్టు జట్టు హోదాలో వెళ్తున్నాం. రహానే గురించి ఆందోళన లేదు. అతడు ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించాడు’ అని ప్రసాద్ చెప్పారు.