
నేటి నుంచి చాంపియన్స్ లీగ్
మొహాలీ: చాలా కాలంగా అసలు సిసలు క్రికెట్ మజా లేక మొహం వాచిపోయి ఉన్న అభిమానులను అలరించేందుకు ఇప్పుడు టి20 పండగొచ్చింది. స్టార్ క్రికెటర్లు అనేక మంది పాల్గొంటున్న చాంపియన్స్ లీగ్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా మంగళ, బుధ, శుక్రవారాల్లో ఆరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. తొలి మ్యాచ్‌లో ఐపీఎల్-6 చాంపియన్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. 6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 38 కోట్లు) ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో మొత్తం 29 మ్యాచ్‌లు జరుగుతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఫైసలాబాద్ వోల్వ్స్, ఒటాగో ఓల్ట్స్, కందురతా మారూన్స్ అర్హత మ్యాచుల్లో తలపడుతున్నాయి. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన రెండు జట్లు మెయిన్ డ్రాకు క్వాలిఫై అవుతాయి.
క్వాలిఫయింగ్ జట్ల బలాబలాలు
హైదరాబాద్ సన్‌రైజర్స్: టెస్టు క్రికెట్‌లో తుఫాన్ సెంచరీతో అరంగేట్రం చేసిన మైదానంలోనే ఇప్పుడు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ ధావన్‌తో పాటు కామెరాన్ వైట్, జేపీ డుమిని రైజర్స్ బ్యాటింగ్‌కు మూలస్థంభాలు. కీపర్ పార్థివ్, విహారి కూడా బ్యాటింగ్‌లో కీలకం. బౌలింగ్‌లో మాత్రం రైజర్స్ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. స్టెయిన్, ఇషాంత్‌ల వేగంతో పాటు అమిత్ మిశ్రా, కరణ్ శర్మలు ప్రత్యర్థిని నిలువరించగలరు. ఆల్‌రౌండర్లు తిసార పెరీరా, స్యామీ, ఆశిష్ రెడ్డి రెండు విభాగాల్లోనూ అండగా నిలిస్తే రైజర్స్‌కు తిరుగుండదు.
ఫైసలాబాద్ వోల్వ్స్: సరిహద్దు వివాదం, వీసా సమస్యల కారణంగా ఆఖరి నిమిషం వరకు కూడా లీగ్‌లో పాల్గొనడం ఖరారు కాని ఈ జట్టుకు ఎట్టకేలకు భారత్‌లో ఆడే అవకాశం దక్కింది. పటిష్టమైన జట్టు కాకపోయినా, సంచలనాలు సృష్టించే సత్తా ఉంది. అక్కడి బలమైన జట్లపై గెలుపుతో పాక్ దేశవాళీ టోర్నీ సూపర్ ఎయిట్ టి20 టోర్నీ విజేతగా నిలిచి ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. మిస్బావుల్ నాయకత్వంతో పాటు సయీద్ అజ్మల్ జట్టుకు ప్రధాన బలం. ఆసిఫ్ అలీ జట్టులో కీలక బ్యాట్స్‌మన్. గత ఏడాదినుంచి పాక్‌నుంచి సీఎల్‌టి20 ఆడిన సియాల్‌కోట్ కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఫైసలాబాద్ పట్టుదలగా ఉంది.
ఒటాగో వోల్ట్స్: కివీస్ దేశవాళీ హెచ్‌ఆర్‌వీ కప్ విజేత. అక్కడి టోర్నీలో భారీ స్కోర్లతో వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. తొలి చాంపియన్స్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉంది. అయితే అప్పుడు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఇటీవలే శ్రీలంకలో నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడి ఈ టోర్నీకి సిద్ధమైంది. రెండు రోజుల క్రితం మొహాలీలో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏకంగా 258 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రధాన బలం కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న ర్యాన్ టెన్ డస్కటే మరో కీలక ఆటగాడు.
కందురతా మారూన్స్: చాంపియన్స్ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగుతోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో అక్కడి బోర్డు హడావిడిగా సూపర్ ఫోర్స్ టోర్నీ నిర్వహించగా...అందులో మారూన్స్ విజేతగా నిలిచింది. జట్టులో సగం మంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు. టి20ల్లో జట్టు సభ్యుల ఇటీవలి ప్రదర్శన చూస్తే ఈ టీమ్‌ను పటిష్టమైనదిగానే చెప్పవచ్చు. సీనియర్ ప్లేయర్ సంగక్కర రైజర్స్‌ను కాదని సొంత దేశపు జట్టుకు ఆడుతుండటం కందురతా బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో మెండిస్ కీలక ఆటగాడు.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
ఫైసలాబాద్ వోల్వ్స్ ్ఠ ఒటాగో వోల్ట్స్
సాయంత్రం గం. 4.00 నుంచి
హైదరాబాద్ సన్‌రైజర్స్ ్ఠ కందురతా మారూన్స్
రాత్రి గం. 8.00 నుంచి
స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం