పుణే: బెంగళూరుకు ఇక చావోరేవో! ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఆడబోయే అయిదు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించాల్సిందే. పేలవ బ్యాటింగ్‌కు తోడు కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడిచిన రాయల్ చాలెంజర్స్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/18) స్పిన్ మాయాజాలంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేయగలిగింది. పూర్తి నిస్సారంగా సాగిన ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఓపెనర్ పార్థివ్ పటేల్ (41 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మినహా ఏ ఒక్క ప్రధాన బ్యాట్స్‌మన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో టిమ్ సౌతీ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో పరువు దక్కింది. ఛేదనలో రాయుడు (25 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడ చూపగా, ధోని (23 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌లతో చెన్నై మరో 12 బంతులు ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఆర్‌సీబీ... జడ్డూకు చిక్కి!
అసలు బ్యాటింగ్ చేస్తున్నది బెంగళూరేనా! అన్నట్లు సాగింది ఆ జట్టు ఇన్నింగ్స్. మెకల్లమ్ (5) రెండో ఓవర్లోనే ఇన్‌గిడికి చిక్కాడు. డికాక్ స్వదేశానికి వెళ్లడంతో మ్యాచ్ అవకాశం దక్కిన పార్థీవ్ ఓ ఎండ్‌లో చక్కగా షాట్లు కొడుతున్నా... మిగతావారి నుంచి సహకారం కరువైంది. జడేజా తొలి బంతికే కోహ్లి (8) బౌల్డయ్యాడు. డివిలియర్స్ (1) హర్భజన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మన్‌దీప్ (7), గ్రాండ్‌హోమ్ (8) త్వరగానే వెనుదిరిగారు. అర్ధశతకం (37 బంతుల్లో) పూర్తయిన వెంటనే పార్థివ్... జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. 15.1 ఓవర్‌కు ఆర్‌సీబీ స్కోరు 89/8. కనీసం వందైనా చేస్తుందా? అనే పరిస్థితి నుంచి ఆ జట్టు బయట పడిందంటే సౌతీ చలవే.
చెన్నై నింపాదిగా...
లక్ష్యం చిన్నదే అయినా చెన్నై ఛేదన మెరుపుల్లేకుండానే మొదలైంది. సౌతీ వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి, చహల్ ఓవర్‌ను మెయిడిన్ ఆడిన వాట్సన్ (11) ఉమేశ్ అద్భుత యార్కర్‌కు నిలవలేకపోయాడు. అయితే... రాయుడు, రైనా (25) నింపాదిగా పరుగులు చేస్తూ పోయారు. సౌతీ ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన రాయుడు రన్‌రేట్ మరీ తగ్గకుండా చూశాడు. రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాక ఉమేశ్ బౌలింగ్‌లో రైనా అవుటయ్యాడు. బంతులు, పరుగులు దాదాపు సమానంగా ఉన్న దశలో ధోని, బ్రేవో (14నాటౌట్) జత కలిశారు. వ్యక్తిగత స్కోర్లు 0, 1 వద్ద పార్థివ్, చహల్ క్యాచ్‌లు వదిలేయడంతో లైఫ్‌లు దక్కిన బ్రేవో కీలక సమయంలో మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాది పరిస్థితిని తేలిక చేశాడు. చహల్ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి ధోని... తనదైన శైలిలో ఘనంగా ముగించాడు.
జడేజాలం
Published Sun, May 6 2018 12:55 AM | Last Updated on Sun, May 6 2018 9:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment