బర్మింగ్‌హమ్: తానేంటో ఇప్పటికే రుజువు చేసుకున్న కారణంగా టీమిండియా టెస్టు జట్టులో స్థానంపై ఎటువంటి అభద్రత భావం లేదని అంటున్నాడు టాపార్డర్ ఆటగాడు చతేశ్వర పుజారా. గత కొంతకాలంగా పుజారా ఫామ్ ఆందోళన పరుస్తున్న తరుణంలో అతను స‍్పందించాడు. ‘ నేనేంటో ఇప్పటికే రుజువు చేసుకున్నాను. భారత జట్టులో చోటుకు నేను పూర్తి అర్హుడినని చాటుకున్నాను. గత సీజన్లో నేను బాగా రాణించాను. జట్టుకు నా వంతుగా చేయాల్సిందంతా చేశాను. దాన్ని జట్టు యాజమాన్యం, సహచరులు గుర్తించారు. తుది జట్టులో చోటు విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. నేను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడాలనే అనుకుంటా. ఐతే టెస్టులతో పోలిస్తే మిగతా ఫార్మాట్ల ఆట భిన్నమైంది. వన్డేల్లో రాణించిన వాళ్లు టెస్టుల్లోనూ బాగా ఆడగలరని గ్యారెంటీ ఏమీ లేదు. ఈ పోలిక తగదు. జట్టులో స్థానంపై నాకు ఎలాంటి అభద్రత భావం లేదు. ఈ విషయంలో యాజమాన్యం నుంచి నాకు భరోసా ఉంది’ అని పుజారా తెలిపాడు.
డబుల్ సెంచరీ కొట్టేద్దామనుకున్నా..
‘నా కెరీర్ ఆరంభంలోనే భారత్‌లో ఆడిన టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు కొట్టేశా. ఇంగ్లండ్‌లో కూడా అలాగే ఆడేద్దామనుకున్నా. డబుల్ సెంచరీలు సులువే అనుకున్నా. కానీ అక్కడ అలాంటి మానసిక స్థితిలో ఆడటం సరికాదని తర్వాత అర్థమైంది. మనం ఏ మైలురాయిని అందుకున్నామన్నది కాదు.. జట్టుకు మంచి స్కోరు అందించామా లేదా అన్నదే ముఖ్యం. అన్నిసార్లూ భారీ స్కోర్లే చేయాల్సిన పని లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రస్తుత కౌంటీ సీజన్లో నేను మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఈసారి కౌంటీలకు వెళ్లినపుడు చాలా ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. మధ్యలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు కోసం భారత్‌కు వచ్చి వెళ్లాల్సి వచ్చింది. అది నా లయను కొంచెం దెబ్బ తీసింది. అయితే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సవాళ్లన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇంగ్లండ్ పిచ్‌లు సవాలు విసురుతాయనడంలో సందేహం లేదు. ఇక్కడ భిన్నమైన టెక్నిక్, మానసిక స్థితితో ఉండాలి’ అని పుజారా పేర్కొన్నాడు. ఆగస్టు 1 వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment