ఆయన అవసరం లేదు | Chief coach Paul van Ass removed | Sakshi
Sakshi News home page

ఆయన అవసరం లేదు

Published Sat, Jul 25 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

ఆయన అవసరం లేదు

ఆయన అవసరం లేదు

- చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్‌ను తొలగించాలి   
- హాకీ ఇండియాకు కమిటీ సూచన
న్యూఢిల్లీ:
భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్ (నెదర్లాండ్స్)ను సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. యాస్‌ను కోచ్ పదవిలో ఎంత మాత్రం కొనసాగించొద్దని తొమ్మిది మంది సభ్యుల కమిటీ శుక్రవారం ప్రతిపాదించింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో జరిగిన గొడవ నేపథ్యంలో యాస్ భవితవ్యాన్ని తేల్చేందుకు సమావేశమైన హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ అన్ని రకాలుగా చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదన చేసింది. అయితే దీనిపై హాకీ ఇండియా (హెచ్‌ఐ), భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తన పనిలో జోక్యం చేసుకోకపోతే తిరిగి పదవి చేపట్టేందుకు సిద్ధమని యాస్ చెబుతున్నట్లు వస్తున్న కథనాలకు కూడా కమిటీ నిర్ణయంతో తెరపడింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో హర్బీందర్, బీపీ గోవింద, ఏబీ సుబ్బయ్య, భాస్కరన్, తోయిబా సింగ్, ఆర్పీ సింగ్, అసుంతా లక్రా, జస్‌జీత్ కౌర్, హెచ్‌ఐ సీఈఓ ఎలెనా నోమన్‌లు పాల్గొన్నారు. ‘మా ప్రతిపాదనలను హాకీ ఇండియాకు ఇచ్చాం. హెచ్‌ఐ, సాయ్‌లు కలిసి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటాయి. హాకీ వరల్డ్ లీగ్‌కు సంబంధించి యాస్ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. మా ఫోన్ కాల్స్‌కు, ఈ మెయిల్స్‌కు ఆయన స్పందించడం లేదు. తిరిగి వచ్చేందుకు టిక్కెట్లు కూడా పంపాం. కానీ టికెట్లు తనకు అందలేదని అబద్ధం చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయింది. అతను తిరిగి వచ్చినా కొనసాగించే అవకాశం లేదు’ అని హర్బీందర్ పేర్కొన్నారు.
 
రియో ఒలింపిక్స్‌కు ఎలా?
కోచ్ పదవి చేపట్టి ఆరు నెలలు కూడా గడవకముందే యాస్ వెళ్లిపోవడంతో మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న రియో ఒలింపిక్స్‌కు జట్టు సన్నద్ధతపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్స్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్ట్‌మన్స్ సరైన వ్యక్తి అని కమిటీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా భారత హాకీతో కలిసి పని చేస్తున్న ఆల్ట్‌మన్స్‌కు జట్టుకు ఏం కావాలో పూర్తిగా తెలుసు. అలాగే కొంతకాలం ఆటగాళ్లతో కూడా కలిసి పని చేశారు. చాలా మంది ఆటగాళ్లు కూడా ఆల్ట్‌మన్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు బాత్రా శనివారం ఆల్ట్‌మన్స్‌తో సమావేశం కానున్నారు. తర్వాత క్రీడాశాఖ అధికారులతోనూ మాట్లాడనున్నారు.
 
‘కమిటీ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఇలాంటి నిర్ణయం వస్తుందని ముందే తెలుసు. పూర్తి నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్న బాత్రా అనవసరంగా నోరు పారేసుకున్నారు. నన్ను పదవి నుంచి తొలగించడానికి దారులు వెతికారు. అందులో సఫలమయ్యారు. నా ప్రతిష్టను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాలి. ఓవరాల్‌గా భారత వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. నన్ను తొలగిస్తున్నట్లు ఆల్ట్‌మన్స్ నుంచి మెయిల్ వచ్చాక నేను నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు.’      -పాల్ వాన్ యాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement