ఎదురులేని సింధు
చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి
పుజు (చైనా): కెరీర్‌లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మారుు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22-20, 21-10తో హీ బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగు టైటిల్స్ (బిట్ బర్గర్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జపాన్ ఓపెన్, స్విస్ ఓపెన్) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీ బింగ్‌జియావో నుంచి సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది.
ఒకదశలో 1-5తో, 14-17తో వెనుకబడిన సింధు నెమ్మదిగా తేరుకొని తుదకు 20-20తో స్కోరును సమం చేసింది. అదే జోరులో వరుసగా రెండు పారుుంట్లు నెగ్గి 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. ఆరంభంలో 7-3తో ముందంజలో ఉన్న సింధు ఆ తర్వాత నిలకడగా పారుుంట్లు సాధించి 14-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు వెనుదిరిగి చూడకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 15-21, 14-21తో ఓడిపోయాడు.