
విజేతగా నిలిచి... వీరంగం సృష్టించి...
చైనా టీటీ ప్రపంచ చాంపియన్ జాంగ్ జైక్ అత్యుత్సాహం
బీజింగ్: మితిమీరితే ఏదైనా అనర్థదాయకమే. చైనాకు చెందిన ప్రపంచ, ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్ జాంగ్ జైక్ విషయంలో ఇది రుజువైంది. జర్మనీలోని డసెల్‌డార్ఫ్ పట్టణంలో ఆదివారం ముగిసిన పురుషుల ప్రపంచ కప్ ఫైనల్లో తన దేశానికే చెందిన మా లాంగ్‌పై 8-11, 11-4, 13-11, 7-11, 2-11, 11-5, 12-10తో జాంగ్ జైక్ గెలిచాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో నెగ్గడంతో జాంగ్ జైక్ సంబరాలకు అంతే లేకుండా పోయింది. అత్యుత్సాహంతో కోర్టు పక్కనే ఉన్న వాణిజ్య ప్రకటనల హోర్డింగ్‌లను బద్దలు కొట్టాడు. ఆ వెంటనే తన కోర్టుకు ఎదురుగా ఉన్న ఇతర హోర్డింగ్‌లనూ బద్దలు కొట్టాడు. తన షర్ట్‌ను విప్పేసి ప్రేక్షకులపైకి విసిరేశాడు. జాంగ్ జైక్ నిర్వాకంపై అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విజేత హోదాలో అతనికి రావాల్సిన ప్రైజ్‌మనీ 45 వేల డాలర్లను (రూ.27 లక్షల 55 వేలు) నిలిపివేసింది. తర్వాత జైక్ తన ప్రవర్తనపట్ల క్షమాపణలు కోరాడు.