పసలేని ఎన్నికల పండుగ  | Lok Sabha Election Mark Is Not Visible In Telangana | Sakshi
Sakshi News home page

పసలేని ఎన్నికల పండుగ 

Published Sun, Apr 7 2019 3:36 PM | Last Updated on Sun, Apr 7 2019 3:36 PM

Lok Sabha Election Mark Is Not Visible In Telangana - Sakshi

అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.

ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు.

కనిపించని ఉత్సాహం 
గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు.

కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట.

అప్పుడే మస్తుగుండే.. 
‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. 
ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. 

ఐదు రోజులే మిగిలింది..
పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్‌ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్‌ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది.

 సంఘాల వారీగా.. 
అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు.

తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్‌ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement