నేనే తొలి వ్యక్తిని కావాలి: క్రిస్ గేల్
సెయింట్ ఆన్స్: క్రిస్ గేల్..విధ్వంసకర క్రికెటర్. ఫీల్డ్ లో దిగాడంటే అవతలి బౌలర్ ఎవరనేది చూడకుండా చెలరేగిపోవడమే ఇతనికి తెలిసిన విద్య. అయితే ప్రపంచ క్రికెట్ లో కొత్త చరిత్రను సృష్టించాలని అనుకుంటున్నట్లు ఈ విండీస్ డాషింగ్ క్రికెటర్ తాజాగా పేర్కొన్నాడు. తనకు 50 ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్ ఆడటమే తన ప్రధాన లక్ష్యమన్నాడు. ఇలా యాభై ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్ ఆడి తొలి వ్యక్తిని తానే కావాలంటూ గేల్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఒకవేళ ఈ లక్ష్యాన్ని చేరిన పక్షంలో క్రికెట్ ఫీల్డ్ లో తన యాక్షన్ను ఏదొక రోజు కూతురు చూసే అవకాశం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 సెప్టెంబర్ నుంచి టెస్టు క్రికెట్ కు దూరమైన గేల్.. ట్వీ 20 ఫార్మాట్పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రపంచ ఓవరాల్ పొట్టి ఫార్మాట్లో గేల్ రికార్డు స్థాయిలో 9,777 పరుగులు చేసి తనదైన ముద్రను వేశాడు.
ఇదిలా ఉంచితే, గతేడాది బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని మెల్బోర్న్ రెన్గేడ్స్ ప్రాంఛైజీ ఎగవేసిందంటూ గేల్ ధ్వజమెత్తాడు. తాను ఒక కరీబియన్ క్రికెటర్ను కావడం వల్లే తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వలేదని విమర్శించాడు. మిగతా క్రికెటర్లకు మొత్తాన్ని చెల్లించిన ప్రాంఛైజీ.. తన విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తుందంటూ ప్రశ్నించాడు. వ్యాఖ్యాతలకు సైతం డబ్బులు చెల్లించిన బీబీఎల్ యాజమాన్యం.. తనకు రావాల్సిన సొమ్ము విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందంటూ నిలదీశాడు. తనకు డబ్బు ఎగవేసిన అపవాదను వారు మూట గట్టుకోరనే ఇంకా ఆశిస్తున్నట్లు గేల్ ట్వీట్లలో పేర్కొన్నాడు.
గతేడాది ఏడాది జనవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ టీవీ జర్నలిస్టుతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించిన గేల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. బీబీఎల్ నుంచి గేల్ ను తప్పించడమే కాకుండా, అతనిపై భారీ జరిమానా కూడా విధించారు.