
ఢాకా: ఆకాశమే హద్దు... పట్టపగ్గాల్లేవ్.. వీర విజృంభణ... ఇలాంటి విశేషణాల కలబోతగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి చెలరేగిపోయాడు. మంగళవారం ఢాకా డైనమైట్స్, రంగ్‌పూర్ రైడర్స్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫైనల్లో విశ్వరూపం చూపాడు. రైడర్స్ ఓపెనర్‌గా వచ్చిన గేల్ 69 బంతుల్లోనే అజేయంగా 146 పరుగులు చేశాడు. 22 పరుగుల వద్ద షకీబుల్ హసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతడు తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో ఏకంగా 18 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. గేల్‌తో పాటు బెండ్రన్ మెకల్లమ్ (54, 4 ఫోర్లు, మూడు సిక్స్‌లు) అదరగొట్టడంతో రంగ్‌పూర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఢాకా డైనమైట్స్ 149/9కే పరిమితం కావడంతో రైడర్స్ తొలిసారి బీపీఎల్ టైటిల్ నెగ్గింది.
ఫైనల్లో గేల్ ఘనతలు..
టి20ల్లో 11 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్. 8,526 పరుగులతో మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. టి20ల్లో అత్యధికంగా 20 శతకాలు చేసిన తొలి బ్యాట్స్‌మన్. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 18 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు. ఈ క్రమంలో 17 సిక్సర్లతో తన పేరిటే ఉన్న రికార్డును (2013లో పుణే వారియర్స్‌పై) తిరగరాశాడు. బీపీఎల్‌లో వంద సిక్సర్లు కొట్టిన, ఓవరాల్‌గా టి20ల్లో 800 సిక్సర్లు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్. మెకల్లమ్‌తో కలిసి నెలకొల్పిన 201 పరుగుల అజేయ భాగస్వామ్యం ఓ టి20 ఫైనల్లో అత్యధిక భాగస్వామ్యం.
Comments
Please login to add a commentAdd a comment