క్లార్క్ గుడ్‌బై | Clark Goodbye | Sakshi
Sakshi News home page

క్లార్క్ గుడ్‌బై

Published Sun, Aug 9 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

క్లార్క్ గుడ్‌బై

క్లార్క్ గుడ్‌బై

యాషెస్ ఐదో టెస్టే ఆఖరిది
 
 నాటింగ్‌హామ్ : ‘గాయాల కారణంగా నేను సరైన ఫామ్‌లో లేను. పరుగులు చేయలేకపోవడం జట్టుకు భారంగా మారింది. ఇంగ్లండ్, ఆసీస్ జట్టుకు ఉన్న తేడా ఇదే. అయితే ఆటలో గెలుపోటములు సహజం. ఈ టెస్టులో ఓడినంత మాత్రాన నేను కెరీర్‌కు గుడ్‌బై చెప్పను. నాలో క్రికెట్ ఆడే సత్తా ఉందని అనుకుంటున్నా. కాబట్టి కెరీర్‌ను కొనసాగిస్తా’ యాషెస్ మూడో టెస్టులో ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మాటలివి. కానీ వారం తిరగకముందే సీన్ రివర్సయింది. నాలుగో టెస్టులో ఓటమి తర్వాత ఊహించని రీతిలో క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. యాషెస్ ఐదో టెస్టే తనకు చివరిదని తెలిపాడు.

‘ఓవల్‌లో చివరి టెస్టు ఆడతా. అందులో ఏం జరుగుతుందో చూద్దాం. బయటకు వెళ్లాలని లేదు. కానీ గత ఏడాది కాలంగా నా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రే ఈ నిర్ణయానికి వచ్చా. సహచరులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్ని వాళ్లు ఊహించలేదు’ అని మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగంతో క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఇక కామెంట్రీ బాక్స్‌లో కూర్చోవడంపై దృష్టిపెడతానని సరదాగా అన్నాడు.

 గాయాల బెడద...: 2011లో పాంటింగ్ వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన క్లార్క్.. ఆసీస్‌కు తిరుగులేని విజయాలు అందించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అత్యున్నత స్థాయి ఆటతీరుతో కుర్ర క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి 30 టెస్టుల్లో 12 సెంచరీలు కొట్టిన క్లార్క్‌ను గత కొంతకాలంగా గాయాలు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. వెన్ను నొప్పి, చీలమండ గాయంతో ఓ దశలో కెరీర్ కొనసాగించడం సందిగ్ధంలో పడింది. అయితే ఎంపిక చేసిన మ్యాచ్‌ల్లోనే ఆడుతూ కొంతకాలం నెట్టుకొచ్చిన క్లార్క్.. ఈ ఏడాది ఆరంభంలో వీటికి శస్త్రచికిత్స చేయించుకుని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.

ఫలితంగా వన్డే ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించి టైటిల్‌నూ అందించాడు. తర్వాత వన్డేలకు, టి20లకు గుడ్‌బై చెప్పాడు. అయితే తాజా గా కాలిపిక్క కండర గాయంతో క్లార్క్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనివల్ల బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేక ఫామ్ కోల్పోయాడు. గత 30 ఇన్నింగ్స్‌లో కేవలం ఆరుసార్లు మాత్రమే 25 పరుగులు చేయడం అతని పరి స్థితికి నిదర్శనం. గత ఆరు టెస్టుల్లో అయితే కనీసం 50 పరుగులు కూడా చే యలేదు. ఓవరాల్‌గా కెరీర్‌లో 114 టెస్టులు ఆడిన క్లార్క్ 197 ఇన్నింగ్స్‌లో 49.30 సగటుతో 8628 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement