
లండన్: ఈ సీజన్ ఐపీఎల్ వల్లే టెస్టుల్లోనూ రాణించగలుగుతున్నానని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో 67 పరుగులు చేసిన అతను రెండో టెస్టులో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ టెస్టులో ఇంగ్లండ్ గెలిచింది. 2014 నుంచి ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయలేకపోయిన బట్లర్‌కు ఆశ్చర్యకరంగా టెస్టు జట్టులో చోటు లభించింది. ఈ అవకాశాన్ని అతను అర్ధసెంచరీలతో చాటుకున్నాడు. ‘ఐపీఎల్ ఆటతోనే నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం పెరిగింది.
భారత్‌లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన అనుభవం బాగా దోహదం చేసింది. అక్కడ వేల మంది ప్రేక్షకుల మధ్య ఒత్తిడి తట్టుకొని విజయవంతం కావడంతో నా ఆటతీరుపై నమ్మకం బాగా పెరిగింది. ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఏ రంగు బంతి అయినా సరే యథేచ్ఛగా ఆడగలను. ఈ ఫామ్‌ను ఇక ముందు కొనసాగిస్తా’నని 27 ఏళ్ల బట్లర్ అన్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment