సిక్సర్లతో చెలరేగి.. ఆపై కడుపునొప్పితో!
క్రికెట్ బాహుబలిగా పేరొందిన వెస్టిండీస్ ప్లేయర్ రకీమ్ కార్న్‌వాల్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. అయితే మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా రకీమ్ వెనుదిరడగంతో అతడు ప్రాతినిధ్యం మహిస్తున్న జట్టు ఓటమి పాలైంది. దాదాపు 150 కిలోల బరువుతో, తనదైన బ్యాటింగ్ శైలితో అభిమానులకు ఆకట్టుకుంటున్నాడు రకీమ్. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో భాగంగా 27వ మ్యాచ్‌లో అలవోకగా సిక్సర్లు బాదుతూ పరుగుల వరద పారించాడు.
సీపీఎల్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్, సెయింట్ లూసియా స్టార్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. తొలుత బార్బడోస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో సెంచరీ చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూయిస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే క్రికెట్ 'బాహుబలి' రకీమ్ కార్న్‌వాల్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో జట్టు విజయానికి చేరువైంది. ఐతే 18వ ఓవర్ రెండో బంతికి కార్న్‌వాల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
అంతకు ముందే ఫిజియోను సంప్రదించిన రకీమ్ మళ్లీ బ్యాటింగ్ చేయాలని చూశాడు. కడుపు నొప్పితో విలవిల్లాడిన అతడు తన భారీకాయంతో పరుగులు తీయలేనని చెప్పి రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. ఆపై ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓడింది. ఆరు సిక్సర్ల బాదిన రకీమ్ 44 బంతుల్లోనే 78 పరుగులు చేసినా.. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడటంతో సెయింట్ లూసియాకు ఓటమి తప్పలేదు.