
మాడ్రిడ్ (స్పెయిన్): దాదాపు రెండేళ్ల జైలు శిక్ష నుంచి ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తప్పించుకున్నాడు. స్పెయిన్ దేశంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి భారీ జరిమానా చెల్లించేందుకు అతను సిద్ధపడ్డాడు. దీనికి అంగీకరించిన కోర్టు జైలు శిక్ష నుంచి రొనాల్డోను విముక్తుడిని చేసింది. దీని ప్రకారం రొనాల్డో కోటీ 88 లక్షల యూరోలు (సుమారు రూ. 152 కోట్లు) ప్రభుత్వానికి జరిమానాగా చెల్లించనున్నాడు. వివరాల్లోకెళితే... స్పెయిన్ క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున 2009 నుంచి 2018 వరకు రొనాల్డో ఆడాడు. అయితే 2011–14 మధ్యలో తనకు వచ్చిన ఆదాయాన్ని అతను బాగా తగ్గించి చూపుతూ పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు.
పైగా నిబంధనల ప్రకారం తక్కువగా పన్ను చెల్లించాల్సి వచ్చే రియల్ ఎస్టేట్‌లో తాను ఈ డబ్బులు సంపాదించానంటూ తప్పుడు నివేదిక కూడా ఇచ్చాడు. అయితే అధికారుల లెక్కల్లో ఇదంతా బయటపడింది. ఈ తప్పిదానికి దాదాపు 23 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. అయితే కొన్నాళ్ల క్రితమే జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ రొనాల్డో రాజీ ప్రతిపాదన చేశాడు. దానిపైనే మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వెజ్‌తో కలిసి కోర్టుకు హాజరు కాగా అతనికి ఊరట కలిగించే తీర్పు వచ్చింది. స్పెయిన్ న్యాయచట్టాల ప్రకారం తొలిసారి తప్పు చేసిన వారి శిక్ష రెండేళ్ల లోపు ఉంటే దానిని రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు ఉంటుంది.