రొనాల్డో గర్జించాడు
యూరో ఫైనల్లో పోర్చుగల్
2-0తో వేల్స్‌పై విజయం
రొనాల్డో గర్జించాడు. అవును.. క్లబ్‌కు మాత్రమే బాగా ఆడతాడనే అపవాదును తునాతునకలు చేస్తూ ఇదిగో ఇదీ నా సత్తా అంటూ విమర్శకులకు తన కిక్ పవర్ ఏమిటో చూపాడు. ఇప్పటిదాకా ఆడిందేమిటని ఆడిపోసుకున్న వారే వహ్‌వా.. రొనాల్డో అని మనస్ఫూర్తిగా అనేలా సింహగర్జన చేశాడు. వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో అతడి విశ్వరూపం చూసి మ్యాచ్ ఆద్యంతం ఈ స్టార్ నామస్మరణతో స్టేడియం మోతెక్కింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతా తననెందుకు కీర్తిస్తారో చాటుకుంటూ... కీలక సమయంలో గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే రెండో గోల్ అందేలా కృషి చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అటు గ్యారెత్ బేల్ ఎంత ప్రయత్నం చేసినా తన జట్టు వేల్స్ అద్భుత ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు.
లియోన్: సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈసారి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరైన సమయంలో జూలు విదిల్చి స్థాయికి తగ్గ ఆటతీరుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. యూరో కప్‌లో భాగంగా బుధవారం వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 2-0తో నెగ్గిన పోర్చుగల్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నిర్ణీత సమయంలో పోర్చుగల్‌కు దక్కిన తొలి విజయమిదే. ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం పోర్చుగల్ టైటిల్ కోసం పోరాడుతుంది. జట్టు తరఫున రొనాల్డో (50వ నిమిషంలో), నాని (53వ ని.) గోల్స్ చేశారు. యూరో కప్‌లో పోర్చుగల్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2004లో ఫైనల్‌కు చేరి గ్రీస్ చేతిలో ఓడింది. మరోవైపు మ్యాచ్‌లో పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా వేల్స్ ఫలితం సాధించలేకపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ తన ప్రయత్నాలను గోల్స్‌గా మలచలేకపోవడంతో వేల్స్ సూపర్ జర్నీ సెమీస్‌లో ముగిసింది. మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్‌సే నిషేధం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం కూడా ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది.
మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 16వ నిమిషంలోనే పోర్చుగల్ తొలి గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. వేల్స్ పెనాల్టీ ఏరియాలో కుడివైపు నుంచి మరియో ఆడిన షాట్ గోల్‌పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. మరోవైపు బేల్ 23వ ని.లో సెంటర్‌లైన్ కుడివైపు నుంచి గోల్ పోస్ట్‌లోకి బంతిని షూట్ చేసినా అది నేరుగా గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 44వ ని.లో ఎడ్రియన్ సిల్వా ఎడమ వైపు నుంచి వేల్స్ గోల్ పోస్ట్ ముందుకు క్రాస్ షాట్ ఆడగా.. రొనాల్డో బంతిని హెడర్ చేశాడు. అయితే బంతి గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లడంతో గోల్‌రాలేదు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో పోర్చుగల్ బోణీ చేయగలిగింది. రఫెల్ గురేరో అందించిన కార్నర్ షాట్‌ను పెనాల్టీ ఏరియాలో మెరుపులా పైకి ఎగిరిన రొనాల్డో హెడర్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే సాంచెస్ ఇచ్చిన పాస్‌ను రొనాల్డో గోల్ పోస్ట్‌వైపు ఆడగా.. అక్కడే ఉన్న నాని డైవ్ చేస్తూ ఎడమ కాలితో బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో పోర్చుగల్‌కు 2-0 ఆధిక్యం లభించింది. తర్వాత 63వ ని.లో రొనాల్డో ఫ్రీకిక్ గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లింది. చివర్లో వేల్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పోర్చుగల్ కీపర్ పాట్రికియో వమ్ము చేయడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.
యూరో కప్‌ల్లో అత్యధిక గోల్స్ (9) చేసిన ఆటగాడు రొనాల్డో. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం మైకేల్ ప్లాటిని సరసన నిలిచాడు.