'మా క్రికెట్ టీమ్ బలహీనంగా లేదు'
అబు దాబి : రేపట్నుంచి పాకిస్థాన్ -ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ముందుగానే ఇరుజట్ల ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బలహీనంగా ఉందంటూ పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్-హక్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ ఎదురుదాడికి దిగాడు. తమ జట్టులో సీనియర్లు లేకపోయినా.. ఇప్పుడు తాము ఎంతమాత్రం బలహీనంగా లేమన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు.
2012 లో పాకిస్థాన్ ఓడించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కంటే ప్రస్తుతం తమతో తలపడుతున్న ఇంగ్లిష్ టీమ్ బలహీనంగా ఉందని మిస్బా వ్యాఖ్యానించడంపై అండర్సన్ స్పందించాడు. కొంతవరకూ తమ జట్టులో అనుభవలేమి ఉండవచ్చు కానీ తామేమి అప్పటికంటే బలహీనంగా అయితే లేమన్నాడు. పాకిస్థాన్ తో తలపడుతున్న తమ జట్టు టాలెంట్ ఉన్న ఆటగాళ్లతో నిండివుందన్న విషయం గుర్తించుకోవాలని మిస్బాకు సూచించాడు.