
డర్బన్: సాధారణంగా ఏ గేమ్‌లోనైనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం అనేది మైదానంలో మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు గొడవ పడిన ఘటన ఆసీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో చోటు చేసుకుంది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటగాళ్లు మైదానం విడిచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.
ప్రధానంగా ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్-దక్షిణాఫ్రికా క్రికెటర్ డీకాక్‌ల మధ్య వాడివాడిగా వాగ్వాదం జరిగింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో టీ విరామంలో వార్నర్-డీకాక్‌లు ఒకర్ని ఒకరు తిట్టుకుంటూ ముందుకు సాగారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. డీకాక్‌పై దూసుకెళ్లే యత్నం చేశాడు. అయితే సహచర ఆటగాళ్లు వార్నర్‌ను ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి గొడవను సద్దుమణిచే యత్నం చేశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ ఖాజాలు వార్నర్‌ను నిలువరించి డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లిపోయారు. ఇది మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు వైరల్‌గా మారింది.
ఏబీ రనౌటే కారణమా..?
అయితే ఏబీ డివిలియర్స్ రనౌట్ కావడమే ఈ గొడవకు ప‍్రధాన కారణంగా తెలుస్తోంది. నాథన్ లయన్ వేసిన బంతిని క్రీజ్‌లో ఉన్న మర్‌క్రామ్ స్వ్కేర్ లెగ్ వైపు ఆడాడు. దాంతో రన్ కోసం మర్‌క్రామ్-ఏబీలు ప్రయత్నించారు. అయితే చివరినిమిషంలో పరుగు విరమించుకోవడంతో మర్‌క్రామ్ క్రీజ్‌లోకి వెళ్లిపోగా, అప్పటికే ముందుకొచ్చిన ఏబీ వెనక‍్కివెళ్లే యత్నం చేశాడు. అదే సమయంలో బంతిని వేగంగా అందుకున్న వార్నర్.. నాన్ స్టైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఆ బంతిని లయన్ అందుకోవడం వికెట్లను నేలకూల్చడం వేగంగా జరిగిపోయాయి. దాంతో ఏబీ భారంగా పెవిలియన్ చేరగా, ఆసీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఇదే వార్నర్-డీకాక్‌ల మధ్య గొడవకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment