
డి విలియర్స్ సెంచరీ
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 421 ఆలౌట్
కేప్ టౌన్: స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డి విలియర్స్ (194 బంతుల్లో 148; 15 ఫోర్లు; 1 సిక్స్) సూపర్ సెంచరీకి తోడు బౌలర్లు కూడా రాణిస్తుండడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆదివారం మూడో రోజు సఫారీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 122.4 ఓవర్లలో 421 పరుగులు చేసింది. విండీస్‌పై 92 పరుగులు ఆధిక్యం సాధించింది. కెప్టెన్ ఆమ్లా (63; 7 ఫోర్లు) రాణిం చాడు. హోల్డర్, శామ్యూల్స్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండు వికెట్లకు 88 పరుగులు చేసింది. జాన్సన్ (37 బ్యా టింగ్; 5 ఫోర్లు), శామ్యూల్స్ (26 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
ఒకే బంతికి ఏడు పరుగులు
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్రాత్‌వైట్ ఒకేసారి 7 పరుగులతో ఖాతా తెరిచాడు. ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని బ్రాత్‌వైట్ పాయింట్ వద్దకు షాట్ ఆడాడు. డివిలియర్స్ బంతిని ఆపేలోపు బ్రాత్‌వైట్, జాన్సన్ మూడు పరుగులు తీశారు. అయితే డివిలియర్స్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వద్దకు విసిరిన త్రోను స్టెయిన్ నిలువరించలేకపోయాడు. దాంతో బంతి బౌండరీ దాటడంతో బ్రాత్‌వైట్ ఖాతాలో ఏడు పరుగులు చేరాయి.