
ఏబీ డివిలియర్స్ చెత్త రికార్డు!
బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవార అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డారెన్ బ్రావో (102) సెంచరీ, పొలార్డ్ (62) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు బౌలర్లు సక్సెస్ కావడంతో విండీస్ 100 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సఫారీ జట్టుకు చెందిన విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. వన్డే సిరీస్లో రెండు కంటే ఎక్కువ ఇన్నింగ్స్ లలో ఏబీ బ్యాటింగ్ చేసిన సందర్భాలలో అతి తక్కువ బ్యాటింగ్ సగటు ఈ ట్రై సిరీస్లో 24.2 నమోదైంది.
ఈ సిరీస్ లో అతని వ్యక్తిగత అత్యదిక స్కోరు 39 పరుగులు కాగా తాజాగా విండీస్ తో మ్యాచ్ లోనూ 2 పరుగులు చేసి ఏబీ నిరాశపరిచాడు. దాదాపు అయిదారేళ్ల కిందట మాత్రమే డివిలియర్స్ ఇంతకన్నా తక్కువ బ్యాటింగ్ సగటును సాధించాడు. రెండో అతి తక్కువ సగటుతో చెత్త రికార్డు ఏబీ ఖాతాలో పడింది. 2010-11లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన డివిలియర్స్ 22.80 సగటుతో 114 పరుగులు మాత్రమే చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులు చేయగా, టార్గెట్ ఛేదనకు దిగిన సఫారీలు విండీస్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 46 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేశారు.