ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో తమ జట్టు సక్సెస్ వెనుక డ్రెసింగ్ రూమ్లో సానుకూల వాతావరణమే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు.
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో తమ జట్టు సక్సెస్ వెనుక డ్రెసింగ్ రూమ్లో సానుకూల వాతావరణమే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా, సాన్నిహిత్యంగా ఉంటున్నారన్నాడు. ఇదే ఢిల్లీ విజయాల బాట పట్టడానికి ప్రధాన కారణమని బ్రాత్ వైట్ అభిప్రాయపడ్డాడు.
' నేను గత మా ప్రదర్శన గురించి మాట్లాడదలుచుకోలేదు. గతేడాది జట్టులో నేను సభ్యుడిని కూడా కాను. ఈ సీజన్ లో మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అంతా కుటుంబంలా కలిసి చర్చిస్తున్నాం. ఇది మా విజయాలకు దోహదం చేస్తుంది'అని బ్రాత్ వైట్ తెలిపాడు. గత మ్యాచ్ లో కీలక స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కు స్థానం దక్కకపోవడానికి నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలన్న నిబంధనే కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయిన బ్రాత్ వైట్.. అన్ని సార్లూ ఆ తరహా ప్రదర్శనతో ఆకట్టుకోవడం కష్టమన్నాడు.తన కంటే ముందు నాయర్,బిల్లింగ్స్ లు రాణించడంతోనే ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించానన్నాడు. బ్యాటింగ్ వచ్చిన ప్రతీసారి హిట్టింగ్ చేయాలంటే అది కష్టసాధ్యమన్నాడు.