ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్... తొలి ఐదు సీజన్లలో మూడు సార్లు సెమీఫైనల్ (2012 ప్లేఆఫ్స్‌తో కలిపి) వరకు చేరి సత్తా ఉన్న టీమ్‌గా కనిపించింది. అయితే 2013 నుంచి జట్టు పరిస్థితి మరీ దీనంగా తయారైంది. రెండు సార్లు చివరి స్థానంలో నిలిస్తే... మరోసారి చివరి నుంచి రెండో స్థానం, మరో రెండు సార్లు చివరి నుంచి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి కొత్త కెప్టెన్ గంభీర్, కొత్త కోచ్ రికీ పాంటింగ్ డేర్‌డెవిల్స్ రాత మార్చగలరా చూడాలి.
సాక్షి క్రీడా విభాగం :ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో అభిమానులు తమ విజయం కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తిపోయారు. ఐపీఎల్‌లో ఎన్నడూ లేని విధంగా యాజమాన్య హక్కులను రెండు సంస్థలు పంచుకోవడంతో కూడా డేర్‌డెవిల్స్ జట్టు వార్తల్లో నిలిచింది. ‘విఫల జట్టు’గా ముద్ర పడటం కూడా అందుకు ఒక కారణమని వినిపించింది. ఈసారి ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. ఐపీఎల్–11లో ఢిల్లీకి ఇప్పుడు గంభీర్ రూపంలో మంచి నాయకుడు దొరికాడు. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండు సార్లు విజేతగా నిలిపిన అతను తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. భారత జట్టుకు దూరమై చాలా కాలమైనా... ఇంకా టి20ల్లో గంభీర్ నమ్మదగిన బ్యాట్స్‌మన్ కావడం జట్టుకు అదనపు బలం. జట్టులో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి గంభీర్ మిడిలార్డర్‌కు మారే అవకాశమూ ఉంది. కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యూహాలు ఆ జట్టును కనీసం ప్లే ఆఫ్‌కు చేర్చగలవు.
ఆ నలుగురు...
ఢిల్లీ తుది జట్టులో కచ్చితంగా ఉండే నలుగురు విదేశీయుల్లో విధ్వంసకర ఓపెనర్ మున్రో, మ్యాక్స్‌వెల్ ఒక్క ఓవర్‌తో జట్టు రాత మార్చేయగలరు. వీరిద్దరితో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు కూడా చోటు ఖాయం. నాలుగో ఆటగాడిగా పేస్ బౌలర్ రూపంలో బౌల్ట్, రబడ అందుబాటులో ఉన్నారు. తాజా ఫామ్ ప్రకారం ఇద్దరూ ప్రమాదకరమైనవారే. ఒక వేళ మున్రో విఫలమైతే మరో భారీ హిట్టర్ జేసన్ రాయ్ కూడా ఎలాగూ ఉన్నాడు. కాబట్టి విదేశీ ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో సమస్య లేదు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే మేనేజ్‌మెంట్ అనుభవంపై ఆధార పడుతుందా లేక కుర్రాళ్లకు అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరం. శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ల స్థానాలకు తిరుగు లేదు. ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌కు కూడా చోటు ఖాయం. నేపాల్ స్పిన్నర్ సందీప్ లిమిచానే ఐపీఎల్‌లోకి వచ్చినా అతను తన అవకాశం కోసం కొంత సమయం ఎదురు చూడక తప్పదు.
జట్టు వివరాలు: గంభీర్ (కెప్టెన్), మన్‌జ్యోత్ కల్రా, పృథ్వీ షా, అయ్యర్, అభిషేక్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, షమీ, సయన్ ఘోష్, నదీమ్, గుర్‌కీరత్ సింగ్ మాన్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, విజయ్ శంకర్, నమన్ ఓజా, రిషభ్ పంత్ (భారత ఆటగాళ్లు). జేసన్ రాయ్, రబడ, సందీప్ లమిచానే, బౌల్ట్, క్రిస్ మోరిస్, మున్రో, క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్ (విదేశీ ఆటగాళ్లు).
Comments
Please login to add a commentAdd a comment