ధోని గుర్తించాడు.. జహీర్ విస్మరించాడు!
చెన్నై:ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 వ సీజన్ లో రికార్డు ధర పలికిన ఆటగాళ్లలో పవన్ నేగీ ఒకడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పవన్ నేగీకి 8.5 కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డేవిల్స్ కొనుగోలు చేసింది. ఆర్సీబీ ఆటగాడు షేన్ వాట్సన్ 9.5 కోట్ల అత్యధిక ధర తరువాత పవన్ నేగీదే ఎక్కువ మొత్తం కావడం విశేషం . దీంతో పవన్ నేగీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన మరుసటి రోజే టీమిండియా జట్టులో అవకాశం దక్కింది. ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలకు చోటు దక్కడంతో తన అదృష్టాన్ని నేగీనే నమ్మలేకపోయాడు.
కాగా, ఐపీఎల్లో నేగీ ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై తాజాగా స్పందించిన నేగీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభను ఢిల్లీ డేర్ డెవిల్స్ సరిగా గుర్త్తించలేదంటూ విమర్శించాడు. తనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా ఢిల్లీ ఎందుకు పక్కను పెట్టిందో ఇప్పటికీ అంతుపట్టడం లేదని వ్యాఖ్యానించాడు. తనకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వడంలో ఢిల్లీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. తనను తప్పించిన విషయాన్నిజట్టు యాజమాన్యం కూడా ఏనాడో చెప్పలేదని స్పష్టం చేశాడు.
' గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తన ప్రతిభను గుర్తించాడు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ మాత్రం తాను జట్టులో ఉన్నా పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. జహీర్ దగ్గరకు వెళ్లి బౌలింగ్ ఇమ్మని అడగలేను కదా. అతనొక సీనియర్ ప్లేయర్ అయ్యుండి కూడా తన ప్రతిభను గుర్తించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది' అని జహీర్ పై అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లాడిన పవన్ నేగీ తొమ్మిది ఓవర్లు పాటు బౌలింగ్ వేసి ఒక వికెట్ తీస్తే, మొత్తంగా 57 పరుగులు చేశాడు. అందులో అతని బెస్ట్ 19 పరుగులు.