ఢిల్లీపై పంజాబ్ విజయం
► వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన జహీర్ సేన
► 9 పరుగులతో నెగ్గిన విజయ్ బృందం
► రాణించిన స్టోయినిస్, సాహా
మొహాలీ: నిరాశాజనక ప్రదర్శనతో అట్టడుగు స్థానానికి పడిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు స్ఫూర్తినిచ్చే విజయం. స్టోయినిస్ (44 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు... వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 52; 7 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో శనివారం జరిగిన ఐపీఎల్-9 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేసింది. డికాక్ (30 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా.. ఆఖర్లో సహచరులు ఒత్తిడికి తలొగ్గారు.
సాహా జోరు...
తొలి ఓవర్‌లో ఒక్క పరుగే వచ్చినా.. పంజాబ్ ఓపెనర్లు విజయ్ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు), స్టోయినిస్ మాత్రం ధాటిగా ఆడారు. వరుస బౌండరీలతో దూకుడు పెంచిన విజయ్ ఆరో ఓవర్‌లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆమ్లా (1) విఫలమైనా... సాహా నిలకడగా ఆడాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ వీరిద్దరు తొలి 10 ఓవర్లలో పంజాబ్ స్కోరును 76/2కు చేర్చారు. 12వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదిన స్టోయినిస్ 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ 14వ ఓవర్‌లో జహీర్ వేసిన బంతిని కట్ చేయబోయి శామ్సన్ చేతికి చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 16; ఒక సిక్స్) నెమ్మదిగా ఆడినా.. సాహా మాత్రం బౌండరీల జోరు చూపెట్టడంతో పంజాబ్ రన్‌రేట్ వాయువేగంతో దూసుకుపోయింది.
అయితే 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సాహా, మ్యాక్స్‌వెల్ వరుస బంతుల్లో అవుటైనా... మిల్లర్ (6 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్), అక్షర్ పటేల్ (5 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రాబట్టడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. మోరిస్ 2 వికెట్లు తీశాడు.
ఆరంభం అదుర్స్...
లక్ష్య ఛేదనలో డికాక్, శామ్సన్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఆరో ఓవర్‌లో డికాక్ తొలి సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 51 పరుగులు చేసింది. అయితే 8వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ (27 బంతుల్లో) పూర్తి చేసిన డికాక్ ఐదో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కరుణ్ నాయర్ (25 బంతుల్లో 23; 1 ఫోర్) నెమ్మదిగా ఆడినా... శామ్సన్ సిక్స్, ఫోర్ కొట్టడంతో 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 91/1కి చేరింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. పరుగులను నియంత్రిస్తూ శామ్సన్ వికెట్‌ను తీశారు. దీంతో రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 15వ ఓవర్‌లో నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన మిల్లర్... తర్వాతి ఓవర్‌లో ఆ తప్పును సరిదిద్దుకున్నాడు.
ఇక 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో బిల్లింగ్స్ (6), బ్రాత్‌వైట్ (12) వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 28 పరుగులుగా మారింది. కానీ క్రీజులో ఉన్న మోరిస్ (17 నాటౌట్), రిషబ్ పంత్ (4 నాటౌట్) 19వ ఓవర్‌లో 3, ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) బ్రాత్‌వైట్ (బి) మోరిస్ 25; స్టోయినిస్ (సి) శామ్సన్ (బి) జహీర్ 52; ఆమ్లా రనౌట్ 1; సాహా (సి) మోరిస్ (బి) షమీ 52; మ్యాక్స్‌వెల్ (బి) మోరిస్ 16; మిల్లర్ (నాటౌట్) 11; అక్షర్ పటేల్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181
వికెట్ల పతనం: 1-45; 2-48; 3-106; 4-152; 5-152
బౌలింగ్: నదీమ్ 4-0-30-0; షమీ 3-0-34-1; మోరిస్ 4-0-30-2; జహీర్ 3-0-25-1; బ్రాత్‌వైట్ 2-0-20-0; మిశ్రా 4-0-37-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అక్షర్ (బి) స్టోయినిస్ 52; శామ్సన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టోయినిస్ 49; కరుణ్ నాయర్ (సి) మిల్లర్ (బి) కరియప్ప 23; బిల్లింగ్స్ (సి) సాహా (బి) స్టోయినిస్ 6; బ్రాత్‌వైట్ (సి) గురుకీరత్ (బి) సందీప్ 12; మోరిస్ (నాటౌట్) 17; పంత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1-70; 2-121; 3-134; 4-141; 5-153.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-36-1; మోహిత్ శర్మ 4-0-21-0; కరియప్ప 4-0-37-1; స్టోయినిస్ 4-0-40-3; అక్షర్ పటేల్ 4-0-32-0.