ఇద్దరు మేటి వ్యక్తుల్లో ఒకరు ఇప్పటికే ఆట నుంచి తప్పుకున్నాడు. మరొకరు ఇంకో నెలలో అదే బాటలో పయనించనున్నాడు.
హర్షా భోగ్లే: ఇద్దరు మేటి వ్యక్తుల్లో ఒకరు ఇప్పటికే ఆట నుంచి తప్పుకున్నాడు. మరొకరు ఇంకో నెలలో అదే బాటలో పయనించనున్నాడు. అయితే వీరిద్దరు ఇప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్ అభిమానుల్లో ఎనలేని ఆనందాన్ని నింపుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ జట్టు విజయాలను అందుకోలేకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ... గుజరాత్ లయన్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫికేషన్‌కు సగం దూరంలో నిలిచినట్లు అవుతుందని వాళ్లకు తెలుసు. రెండు వారాల క్రితం వీళ్లపై ఎవరూ బెట్టింగ్ పెట్టడానికి ఆసక్తి చూపలేదు.
మ్యాచ్ విన్నర్లను కాకుండా కుర్రాళ్లను ఎంపిక చేయడంలో రాహుల్ ద్రవిడ్ విధానం ఏమాత్రం మారలేదు. రాజస్తాన్ రాయల్స్ మాదిరిగానే ఉంది. ఢిల్లీ జట్టులో శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, సంజూ శామ్సన్, కరణ్ నాయర్‌లలో నైపుణ్యానికి కొదవలేదు. వీళ్లకు తోడు డికాక్‌లో అమోఘమైన ప్రతిభ ఉంది. మనల్ని మెరుగుపర్చడానికి ఓ స్టార్ ఆటగాడు చాలా శ్రమిస్తున్నాడని వీళ్లందరూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ర్యాంప్ షాట్లు, రివర్స్ స్వీప్‌లపై కాకుండా తన బలాన్ని బట్టి ఆడేలా బ్యాట్స్‌మెన్‌ను ద్రవిడ్ బాగా ప్రోత్సహిస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనా నిజమైన టి20 విన్నర్ డుమిని ఉన్నాడనే భరోసాతో ఆ విధంగా చేస్తున్నాడు.
కెప్టెన్‌గా జహీర్ ఖాన్‌ను నియమించడం ఓ మాస్టర్ స్ట్రోక్ అని నా అభిప్రాయం. ఈ సమయంలో అతను చాలాకాలం కొనసాగలేడని తెలుసు. అలాగే చురుకైన బౌలర్ కూడా కాదు. కానీ సుదీర్ఘ కాలం నుంచి భారత క్రికెట్‌లో అతను బౌలింగ్ కెప్టెన్. ఇతర బౌలర్లకు అతను స్ఫూర్తిగా నిలిచాడు. షమీని తీర్చిదిద్దడం భారత్ క్రికెట్‌కు లాభించే అంశం.
జహీర్ పైనుంచి ఊడిపడలేదు. కానీ అతనిలోని ఆత్మవిశ్వాసం, సానుకూలత అమోఘం.
స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో నేను మొదటిసారి అతణ్ని చూశా. కెరీర్ ఆఖర్లో ఉన్నాడనే ఉద్దేశంతో డీడీ అతనికి అవకాశం ఇచ్చినా.. రెండో ఆధ్యాయంలో కొత్త అంకం మొదలైంది. భారత క్రికెట్‌కు జహీర్ కోచ్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కూడా ఎంతో దూరంలో లేదు. మొత్తానికి ఐపీఎల్ అతనికి చాలా గొప్ప మలుపునిచ్చింది.
ఆరుగురు బౌలర్లు అందులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో ఆడటం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా ఐపీఎల్‌లో ఇప్పటికే నిరూపించుకున్నారు. తాహిర్ చాలా అరుదుగా విఫలమవుతుంటాడు. షమీ, మోరిస్‌లకు తోడు అవసరమైనప్పుడు జహీర్ బాగా మద్దతిస్తున్నాడు. అయితే ఢిల్లీ ఇప్పుడిప్పుడే విజయాలబాట పట్టినా... ఐపీఎల్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి.