ఖేల్ ఖతం
పీటర్సన్‌పై ఇంగ్లండ్ వేటు
ఇక కెరీర్ ముగిసినట్లే
ఇంగ్లండ్ క్రికెట్‌లో ఊహించిందే జరిగింది. యాషెస్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో కోచ్ ఫ్లవర్‌పై వేటు వేసిన ఈసీబీ దృష్టి ఇప్పుడు ఆటగాళ్లపై పడింది. జట్టు ప్రక్షాళన పేరుతో అందరికంటే ముందుగా వివాదాస్పద క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌పై వేటు వేశారు. రాబోయే వెస్టిండీస్ పర్యటనతో పాటు బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌కు కూడా ఇంగ్లండ్ అతడిని దూరంగా పెట్టింది. ఈసీబీ తాజా నిర్ణయాన్ని కెవిన్ కూడా ముందే ఊహించినట్లున్నాడు...ఇక ఇంగ్లండ్‌కు ఆడలేనం టూ స్వయంగా ప్రకటించాడు.
లండన్: ఇంగ్లండ్ జట్టులో వివాదాస్పద ఆటగాడిగా ముద్రపడిన మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది. ఇంగ్లండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతని కెరీర్‌కు అనూహ్యంగా ఎండ్ కార్డు వేసింది. త్వరలో జరిగే వెస్టిండీస్ పర్యటనతోపాటు ఆ తరువాత బంగ్లాదేశ్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కూ జట్టు ఎంపికలో పీటర్సన్‌ను పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించింది. దీంతో ఇక నీ సేవలు చాలంటూ పరోక్షంగా పీటర్సన్‌కు సంకేతాలిచ్చింది. ఇది కఠిన నిర్ణయమే అయినా వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు జట్టును పునర్ నిర్మించడంలో భాగంగా తీసుకున్నదని ఈసీబీ మేనేజింగ్ డెరైక్టర్ డౌంటన్ తెలిపారు. ఇంగ్లండ్ క్రికెట్‌కు పీటర్సన్ అందించిన సేవలకు ఈసీబీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు.
ఇకపై నాకు అవకాశం లేదు..
ఈసీబీ తాజా నిర్ణయం నేపథ్యంలో ఇకపై తాను ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం పూర్తిగా లేనట్లేనని పీటర్సన్ అన్నాడు. అయితే ఇన్నాళ్లు ఇంగ్లండ్ జట్టుకు ఆడటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్న పీటర్సన్.. క్రికెట్‌కు తానింకా చేయాల్సింది చాలా ఉందని, ఇకపైనా ఆడుతూనే ఉంటానన్నాడు.
బలిపశువును చేశారు: ఇంగ్లండ్ మాజీలు
పీటర్సన్‌పై వేటు వేయాలని తీసుకున్న నిర్ణయంపై పలువురు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. యాషెస్ సిరీస్‌లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పీటర్సన్‌ను బలిపశువును చేశారని మాజీ కెప్టెన్ వాన్ విమర్శిం చగా... కెవిన్ పట్ల కఠినంగా వ్యవహరించారని స్టివార్ట్ అభిప్రాయపడ్డాడు. మాజీ సారథి నాసిర్ హుస్సేన్ మాత్రం తుది నిర్ణయాన్ని జట్టు కెప్టెన్ కుక్‌కు వదిలేయాల్సిందంటూ భిన్నంగా స్పందించాడు.
ఐపీఎల్‌లో డిమాండ్
ఇంగ్లండ్ జట్టుకు పూర్తిగా దూరమైన కెవిన్ పీటర్సన్‌కు లీగ్ టోర్నీలలో మాత్రం భారీగా డిమాండ్ ఉండవచ్చు. రాబోయే ఐపీఎల్-7లో కెవిన్‌ను తీసుకునేందుకు అన్ని జట్లూ ఆసక్తి చూపిస్తున్నాయి. టి20 ఫార్మాట్‌లో చక్కటి స్ట్రోక్ ప్లేయర్‌గా కెవిన్‌కు గుర్తింపు ఉంది. 2010 టి20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం ఆడే అవకాశం ఉండటంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇప్పటికే తమ ఆసక్తిని వెల్లడించింది. పీటర్సన్ గతంలో ఢిల్లీ తరఫున ఐపీఎల్ ఆడాడు.
తొమ్మిదేళ్ల కెరీర్..
టెస్టులు: 104, పరుగులు: 8181, సగటు: 47.28, సెంచరీలు 23, అర్ధ సెంచరీలు 35
వన్డేలు: 136, పరుగులు: 4440, సగటు: 40.73, సెంచరీలు 9, అర్ధ సెంచరీలు 25
టి20లు: 37, పరుగులు: 1176, స్ట్రైక్ రేట్ 141. 51, అర్ధ సెంచరీలు 7