ఓవల్‌లోనూ ‘ఓల్డ్’ట్రాఫర్డ్! | Indian batsmen crumble against England's pacers at the Oval | Sakshi
Sakshi News home page

ఓవల్‌లోనూ ‘ఓల్డ్’ట్రాఫర్డ్!

Published Sat, Aug 16 2014 12:58 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

ఓవల్‌లోనూ ‘ఓల్డ్’ట్రాఫర్డ్! - Sakshi

ఓవల్‌లోనూ ‘ఓల్డ్’ట్రాఫర్డ్!

ఎనిమిది పరుగులకే 4 వికెట్లు కోల్పోలేదని సంతోషించాలా... గత మ్యాచ్‌లాగా కనీసం 150 కూడా చేయలేకపోయారని బాధపడాలా!

ఆరు సున్నాలు చుట్టలేదని ఆనందించాలా... ఎనిమిది మంది ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యారని అయ్యో అనాలా!

అలీకి ఈసారి మన టాప్ బ్యాట్స్‌మెన్ చిక్కలేదని చెప్పుకోవాలా... అతను ఒక్క బంతి కూడా వేయక ముందే  కుప్పకూలామని అనుకోవాలా!

అవును... భారత్ తమ చెత్త ఆటతీరును మార్చుకోలేదు. నిలకడలేమితో ఓల్డ్‌ట్రాఫర్డ్ ప్రదర్శననే గుర్తు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన మన ఆటగాళ్లు వరుస కట్టి పెవిలియన్ వైపు పరేడ్ చేశారు.

అయితే... ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మరోసారి కెప్టెన్ ఆపద్బాంధవుడయ్యాడు. టెస్టు క్రికెట్ ఆడాలంటే టెక్నిక్ ఒక్కటే కాదని, తెగువ కూడా ఉండాలని నిరూపించాడు. మొండితనంతో, చివరి బ్యాట్స్‌మన్ అండతో ఆడి కాస్త పరువు దక్కించాడు.
 
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 148 ఆలౌట్
ధోని ఒంటరి పోరాటం
82 పరుగులు చేసిన కెప్టెన్
ఇంగ్లండ్ 62/0
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుస రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడినా... తీరు మారని టీమిండియా అదే వైఫల్యాన్ని కొనసాగించింది. ఫలితంగా శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన చివరి, ఐదో టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోని (140 బంతుల్లో 82; 15 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే వీరోచితంగా పోరాడాడు. ఇషాంత్ శర్మ (42 బంతుల్లో 7 నాటౌట్)తో కలిసి ఆఖరి వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. ఈ సిరీస్‌లో ధోనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం.

28 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ చివరి వికెట్‌గా అవుటయ్యాడు. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా అతను జట్టులోని ఇతర సభ్యులు చేసిన మొత్తం పరుగులకంటే తానొక్కడే ఎక్కువ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, జోర్డాన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. రాబ్సన్ (65 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), కుక్ (49 బంతుల్లో 24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.

 

తొలి సెషన్: టపటపా
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ వాతావరణంలో తేమను దృష్టిలో ఉంచుకొని మరో ఆలోచన లేకుండా ప్రత్యర్థి బ్యాటింగ్ అప్పగించాడు. భారత తుది జట్టులో పంకజ్, జడేజా స్థానాల్లో ఇషాంత్, బిన్నీలకు చోటు దక్కింది. మైదానం తడిగా ఉండటంతో ఆట అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అన్యమనస్కంగా ఆడి గంభీర్ (0) వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత పుజారా (4), కోహ్లి (6), రహానే (0) అతడిని అనుసరించారు. వీటిలో రెండు వికెట్లు జోర్డాన్‌కు దక్కాయి. అంతకుముందు అద్భుత బంతితో పుజారాను బ్రాడ్ అవుట్ చేశాడు. సాధ్యమైనన్ని బంతులు ఎదుర్కొని నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన విజయ్ (64 బంతుల్లో 18) కూడా స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో 20 ఓవర్ల లోపే భారత్ 5 వికెట్లు కోల్పోయింది.
ఓవర్లు: 25, పరుగులు: 43, వికెట్లు: 5
రెండో సెషన్: పోరాడిన ధోని

లంచ్ తర్వాత పేలవమైన షాట్‌తో బిన్నీ (5) వెనుదిరగ్గా... ఆ తర్వాత అశ్విన్ (13), భువనేశ్వర్ (5), ఆరోన్ (1) కూడా కెప్టెన్‌కు సహకారం అందించలేకపోయారు. ఈ దశలో భారత్ స్కోరు వంద పరుగులు కూడా దాటదేమో అనిపించింది. అయితే మరో ప్రత్యామ్నాయం లేని ధోని ఎదురు దాడికి దిగాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఫోర్లతో విరుచుకుపడ్డాడు. స్లిప్‌లో బెల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఇషాంత్ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. టీ విరామం ఆలస్యంగా ప్రకటించినా... ఈ జోడిని విడదీయడంలో ఇంగ్లండ్ బౌలర్లు విఫలమయ్యారు.
ఓవర్లు: 31, పరుగులు:82, వికెట్లు: 4
మూడో సెషన్: ఇంగ్లండ్ నిలకడ

విరామం తర్వాత ధోని మరో నాలుగు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. ఎట్టకేలకు ఈ సెషన్ ఆరో ఓవర్లో ఇంగ్లండ్ శ్రమ ఫలించింది. బ్రాడ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన కెప్టెన్.. లాంగ్‌లెగ్‌లో వోక్స్ చేతికి చిక్కాడు. ఇషాంత్‌తో జోడించిన 58 పరుగుల్లో ధోని ఒక్కడే 50 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఆడింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో ఒక సారి కుక్ ఎల్బీగా అవుటయ్యే అవకాశం చిక్కినా... అంపైర్ స్పందించలేదు. దాంతో తొలి రోజును ఇంగ్లండ్ విజయవంతంగా ముగించింది.
ఓవర్లు: 5.1, పరుగులు: 23, వికెట్లు: 1 (భారత్)
ఓవర్లు: 19, పరుగులు: 62, వికెట్లు: 0 (ఇంగ్లండ్)
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) రూట్ (బి) వోక్స్ 18; గంభీర్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; పుజారా (బి) బ్రాడ్ 4; కోహ్లి (ఎల్బీ) (బి) జోర్డాన్ 6; రహానే (సి) అండ్ (బి) జోర్డాన్ 0; ధోని (సి) వోక్స్ (బి) బ్రాడ్ 82; బిన్నీ (సి) కుక్ (బి) అండర్సన్ 5; అశ్విన్ (సి) రూట్ (బి) వోక్స్ 13; భువనేశ్వర్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 5; ఆరోన్ (సి) అండ్ (బి) వోక్స్ 1; ఇషాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (61.1 ఓవర్లలో ఆలౌట్) 148
వికెట్ల పతనం: 1-3; 2-10; 3-26; 4-28; 5- 36; 6-44; 7-68; 8-79; 9-90; 10-148.
బౌలింగ్: అండర్సన్ 17-4-51-2; బ్రాడ్ 15.1-4-27-2; జోర్డాన్ 14-7-32-3; వోక్స్ 14-7-30-3; అలీ 1-0-1-0.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బ్యాటింగ్) 24; రాబ్సన్ (బ్యాటింగ్) 33; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 62
బౌలింగ్: భువనేశ్వర్ 7-1-25-0; ఇషాంత్ 7-2-12-0; ఆరోన్ 3-0-14-0; బిన్నీ 2-0-7-0.
 
ఆ అప్పీల్ చేసి ఉంటే...

బ్యాట్స్‌మన్ కచ్చితంగా అవుట్ కాదని తెలిసిన సందర్భాల్లోనూ ఒత్తిడి పెంచేందుకు ప్రత్యర్థి ఫీల్డర్లు పదే పదే అప్పీల్ చేయడం సర్వ సాధారణం. అయితే తొలి రోజు ఇంగ్లండ్ జట్టు ఏ మూడ్‌లో ఉందో గానీ అసలైన అవుట్‌కు కూడా అప్పీల్ చేయలేదు. అది ఆ జట్టుకు మరో 50 పరుగుల నష్టాన్ని కలిగించింది! ధోని 32 పరుగులతో ఉన్నప్పుడు జోర్డాన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతిని అందుకున్న కీపర్ బట్లర్ పెద్దగా పట్టించుకోకపోగా, ఫీల్డర్లూ మౌనం వహించారు. అయితే ఆ తర్వాత స్నికో మీటర్ పరిశీలనలో బంతి, బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లో పడినట్లుగా తేల్చింది. భారత్ స్కోరు 90/9గా ఉన్న ఈ సమయంలో ధోని అవుటై ఉంటే మన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement