అంకితభావం c/o అనిల్ | Devoted c / o Anil | Sakshi
Sakshi News home page

అంకితభావం c/o అనిల్

Published Fri, Jun 24 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

అంకితభావం c/o అనిల్

అంకితభావం c/o అనిల్

‘ఒక్క జట్టు మాత్రమే ఈ రోజు క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడింది’... ఆస్ట్రేలియా సిరీస్‌లో మంకీ గేట్ వివాదం సందర్భంగా భారత కెప్టెన్ కుంబ్లే చేసిన ఈ వ్యాఖ్య ప్రపంచ క్రికెట్‌లో సంచలనం రేపింది. గణాంకాల్లాగే కెప్టెన్ మాటలకు కూడా రికార్డులు ఉంటే అనిల్ వికెట్లలాగే దీనికి కూడా అగ్రస్థానం దక్కేది. ఆ వివాదాన్ని పరిష్కరించడంలో గొప్ప రాజనీతిజ్ఞుడిలా కనిపించిన కుంబ్లే, కెరీర్ ఆసాంతం కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. ఆటపై అపరిమిత పరిజ్ఞానం, అంకితభావం, క్రమశిక్షణ, ఓటమిని అంగీకరించని పోరాటతత్వం, పట్టుదల... అన్నీ కలగలిస్తే కుంబ్లే.

తలకు బలమైన గాయం తగిలినా జట్టు కోసం బ్యాండేజ్ కట్టుకొని మరీ బరిలోకి దిగడం ఆధునిక క్రికెట్‌లో ఏ ఆటగాడిలోనూ కనిపించని విలక్షణ స్ఫూర్తి. ఇది అనిల్ సొంతం. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఒక్క వివాదమూ దరి చేరనివ్వని జెంటిల్‌మన్ ఇమేజ్ కుంబ్లేను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆయనపై అందరికీ ఉన్న మర్యాద ఎలాంటిదంటే బెంగళూరులో ఒక రోడ్డుకు అనిల్ కుంబ్లే పేరు పెట్టి ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించేంత!


గ్రేట్ స్పిన్నర్, గ్రేట్ కెప్టెన్
దశాబ్ద కాలం పాటు అతను ఆటగాడిగా భారత క్రికెట్ రాతను నిర్దేశించాడు. ఏ బౌలర్ కూడా మన జట్టుకు ఇన్ని విజయాలు అందించలేదు. అది అడిలైడ్ అయినా, హెడింగ్లీ అయినా... ముల్తాన్ అయినా కింగ్‌స్టన్ అయినా... కుంబ్లే లెగ్‌స్పిన్‌కు ఎదుటి బ్యాట్స్‌మెన్ గింగిరాలు తిరిగిన రోజులు ఎన్నెన్నో. పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఆ ఘనతకు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.  మైదానంలో కష్టపడటానికి వెనుకాడని ఆ తత్వం ఒకే ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లు కూడా వేయించింది! ఇప్పుడు భారత జట్టుకు కావాల్సింది దూకుడైన కోచ్, అది కుంబ్లేలో లేదు అనేవారు ఆటగాడిగా అతడిని చూసినట్లు లేదు.

ఒక్కసారిగా 2008 పెర్త్ టెస్టు గుర్తు చేసుకుంటే చాలు!  సిడ్నీ అవమానం తర్వాత ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఒక్క మాట కూడా అనకుండానే కుంబ్లే కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు అద్భుతం. బంతి బంతికీ, వికెట్ వికెట్‌కూ కుంబ్లేలో కనిపించిన కసి, ఆవేశమే ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాయి. ఆ మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత ‘వాకా’లో మరే ఉపఖండపు జట్టు గెలుపు దరిదాపులకు కూడా రాలేదు.  


 కుర్రాళ్లకు అండగా...
2008లో రిటైర్ అయ్యాక కూడా కుంబ్లే అనుబంధం ఆటతో కొనసాగింది. కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్‌సీఏ చైర్మన్‌గా, బీసీసీఐ టెక్నికల్ కమిటీ సభ్యుడిగా పరిపాలనలో చురుగ్గా ఉన్న ఆయన, ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కూడా పని చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో ఆటగాడిగా, మెంటార్‌గా కూడా ఇటీవలి వరకు కుంబ్లే చురుగ్గా ఉన్నారు. ధోని, కోహ్లిలతో కలిసి ఆడిన అనుభవం కుంబ్లేకు ఉంది. తన పనితోనే అందరికీ సమాధానం చెప్పాలని భావించే కుంబ్లేకు కోచ్‌గా మున్ముందు మరీ ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు.

టెస్టుల్లో వెస్టిండీస్ జట్టుతో పెద్దగా సమస్య ఎదురు కాకపోవచ్చు. ఆ తర్వాత స్వదేశంలో వరుసగా 13 టెస్టులు కోచ్‌గా కుంబ్లే పనిని సులువు చేసేవే. ఆటగాడిగా తన అపార అనుభవంతో కొత్త కుర్రాళ్లను తీర్చిదిద్దడం, జట్టు వ్యూహాల్లో భాగస్వామిగా కుంబ్లే మార్క్ వచ్చే ఏడాది కనిపించడం మాత్రం ఖాయం.    - సాక్షి క్రీడావిభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement