monkey gate
-
Harbhajan-Symonds: మిత్రమా ఇంత త్వరగా వెళ్లిపోయావా..!
Harbhajan Shocked With Symonds Sudden Demise: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సైమండ్స్ మృతి పట్ల యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు సైమో సమకాలీకులైన భారత క్రికెటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సైమోతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. సైమండ్స్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా అంటూ విచారం వ్యక్తం చేశాడు. సైమో కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశాడు. సైమండ్స్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడికి ప్రార్థిస్తున్నాని ట్వీటాడు. Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds — Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022 కాగా, సైమండ్స్-హర్భజన్ సింగ్ 'మంకీ గేట్' వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేసిన విషయం తెలిసిందే. 2008 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ (సిడ్నీ) మ్యాచ్‌లో సైమండ్స్, భజ్జీలు గొడవకు దిగారు. హర్భజన్ తనను ‘మంకీ’ అని పిలిచాడని, జాతి వివక్ష కామెంట్లతో దూషించాడని సైమండ్స్ ఆరోపించాడు. అయితే విచారణలో హర్భజన్.. సైమండ్స్‌ని ‘మంకీ’ అనలేదని, ‘మా..కీ’ అన్నాడని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ సాక్ష్యం చెప్పడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. భజ్జీ తప్పు చేయలేదని ఆధారాలున్నా ఐసీసీ అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో చిరెత్తిపోయిన బీసీసీఐ ఆసీస్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునేందుకు రెడీ అయ్యింది. దీంతో కాస్త వెనక్కు తగ్గిన ఐసీసీ భజ్జీపై నిషేధాన్ని ఎత్తి వేసింది. తదనంతర పరిణామాల్లో సైమో, భజ్జీలను ఐపీఎల్ కలిపింది. వీరిద్దరూ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో మంచి మిత్రులయ్యారు. పాత కలహాలను మరచిపోయి స్నేహితుల్లా మెలిగారు. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
'ఆ వివాదం చాలా రోజులు వెంటాడింది'
సిడ్నీ : 2008లో జరిగిన 'మంకీ గేట్ వివాదం' క్రికెట్ ప్రేమికులెవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదంపై తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘటనను మరోసారి గుర్తు చేశాడు. 'బహుశా మంకీ గేట్ వివాదం నా కెప్టెన్సీ కెరీర్లోనే అత్యంత హీనమైన ఘటన. 2005 యాషెస్ సిరీస్ ఓటమి కూడా కఠినమైనదే. కానీ ఈ సిరీస్ ఓటమి అనేది నా నియంత్రణలో జరిగింది. కానీ మంకీగేట్ వివాదం చోటు చేసుకున్నప్పుడు మాత్రం నేనేం చేయలేకపోయాను. ఇది చాలా రోజులు మమ్మల్ని వెంటాడింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కోసం మైదానంలోకి వస్తుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగింపులో ఈ వివాదంపై విచారణ జరిగింది. మంకీగేట్ వివాదం తుది ఫలితంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఇది మా తదుపరి మ్యాచ్ ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు గెలుస్తామనుకున్నాం... కానీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') 2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్ సింగ్ తనను మంకీ అంటూ జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పటి అప్పీల్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో బజ్జీకి శిక్షను రద్దు చేశారు. (క్రికెటర్ హర్బజన్‌సింగ్ బ్యాట్ చోరీ) -
అంకితభావం c/o అనిల్
‘ఒక్క జట్టు మాత్రమే ఈ రోజు క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడింది’... ఆస్ట్రేలియా సిరీస్‌లో మంకీ గేట్ వివాదం సందర్భంగా భారత కెప్టెన్ కుంబ్లే చేసిన ఈ వ్యాఖ్య ప్రపంచ క్రికెట్లో సంచలనం రేపింది. గణాంకాల్లాగే కెప్టెన్ మాటలకు కూడా రికార్డులు ఉంటే అనిల్ వికెట్లలాగే దీనికి కూడా అగ్రస్థానం దక్కేది. ఆ వివాదాన్ని పరిష్కరించడంలో గొప్ప రాజనీతిజ్ఞుడిలా కనిపించిన కుంబ్లే, కెరీర్ ఆసాంతం కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. ఆటపై అపరిమిత పరిజ్ఞానం, అంకితభావం, క్రమశిక్షణ, ఓటమిని అంగీకరించని పోరాటతత్వం, పట్టుదల... అన్నీ కలగలిస్తే కుంబ్లే. తలకు బలమైన గాయం తగిలినా జట్టు కోసం బ్యాండేజ్ కట్టుకొని మరీ బరిలోకి దిగడం ఆధునిక క్రికెట్లో ఏ ఆటగాడిలోనూ కనిపించని విలక్షణ స్ఫూర్తి. ఇది అనిల్ సొంతం. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో ఒక్క వివాదమూ దరి చేరనివ్వని జెంటిల్మన్ ఇమేజ్ కుంబ్లేను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆయనపై అందరికీ ఉన్న మర్యాద ఎలాంటిదంటే బెంగళూరులో ఒక రోడ్డుకు అనిల్ కుంబ్లే పేరు పెట్టి ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించేంత! గ్రేట్ స్పిన్నర్, గ్రేట్ కెప్టెన్ దశాబ్ద కాలం పాటు అతను ఆటగాడిగా భారత క్రికెట్ రాతను నిర్దేశించాడు. ఏ బౌలర్ కూడా మన జట్టుకు ఇన్ని విజయాలు అందించలేదు. అది అడిలైడ్ అయినా, హెడింగ్లీ అయినా... ముల్తాన్ అయినా కింగ్స్టన్ అయినా... కుంబ్లే లెగ్‌స్పిన్‌కు ఎదుటి బ్యాట్స్‌మెన్ గింగిరాలు తిరిగిన రోజులు ఎన్నెన్నో. పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఆ ఘనతకు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. మైదానంలో కష్టపడటానికి వెనుకాడని ఆ తత్వం ఒకే ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లు కూడా వేయించింది! ఇప్పుడు భారత జట్టుకు కావాల్సింది దూకుడైన కోచ్, అది కుంబ్లేలో లేదు అనేవారు ఆటగాడిగా అతడిని చూసినట్లు లేదు. ఒక్కసారిగా 2008 పెర్త్ టెస్టు గుర్తు చేసుకుంటే చాలు! సిడ్నీ అవమానం తర్వాత ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఒక్క మాట కూడా అనకుండానే కుంబ్లే కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు అద్భుతం. బంతి బంతికీ, వికెట్ వికెట్‌కూ కుంబ్లేలో కనిపించిన కసి, ఆవేశమే ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాయి. ఆ మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత ‘వాకా’లో మరే ఉపఖండపు జట్టు గెలుపు దరిదాపులకు కూడా రాలేదు. కుర్రాళ్లకు అండగా... 2008లో రిటైర్ అయ్యాక కూడా కుంబ్లే అనుబంధం ఆటతో కొనసాగింది. కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్సీఏ చైర్మన్‌గా, బీసీసీఐ టెక్నికల్ కమిటీ సభ్యుడిగా పరిపాలనలో చురుగ్గా ఉన్న ఆయన, ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కూడా పని చేస్తున్నారు. ఇక ఐపీఎల్లో ఆటగాడిగా, మెంటార్‌గా కూడా ఇటీవలి వరకు కుంబ్లే చురుగ్గా ఉన్నారు. ధోని, కోహ్లిలతో కలిసి ఆడిన అనుభవం కుంబ్లేకు ఉంది. తన పనితోనే అందరికీ సమాధానం చెప్పాలని భావించే కుంబ్లేకు కోచ్‌గా మున్ముందు మరీ ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. టెస్టుల్లో వెస్టిండీస్ జట్టుతో పెద్దగా సమస్య ఎదురు కాకపోవచ్చు. ఆ తర్వాత స్వదేశంలో వరుసగా 13 టెస్టులు కోచ్‌గా కుంబ్లే పనిని సులువు చేసేవే. ఆటగాడిగా తన అపార అనుభవంతో కొత్త కుర్రాళ్లను తీర్చిదిద్దడం, జట్టు వ్యూహాల్లో భాగస్వామిగా కుంబ్లే మార్క్ వచ్చే ఏడాది కనిపించడం మాత్రం ఖాయం. - సాక్షి క్రీడావిభాగం -
నేనూ రాస్తా... అందులో తెలుస్తాయన్నీ!
బెంగళూరు: మంకీగేట్ ఉదంతంపై త్వరలో తాను ఓ పుస్తకం రాస్తానని అందులోనే వాస్తవాలన్నీ తెలుస్తాయని భారత దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పారు. అప్పటి టీమిండియాకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. సిడ్నీ టెస్టులో భజ్జీ-సైమో వివాదంపై పాంటింగ్ తన పుస్తకంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత్రను ప్రశ్నించిన సంగతి విదితమే.. దీనిపై స్పందించిన కుంబ్లే ‘ఐదేళ్ల క్రితం జరిగిన ఉదంతం గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. కానీ నేనిప్పుడు దానిపై వ్యాఖ్యనించను. అయితే దీనిపై వాస్తవాలతో ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉంది. నిజానిజాలేమిటో తెలుసుకోవాలనుకుంటే నా పుస్తకం కోసం వేచి చూడండి’ అని అన్నారు. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ‘స్వీయచరిత్ర’ పుస్తకాల్లో భారత ఆటగాళ్లపై, బోర్డు అధికారులపై విమర్శలు గుప్పించడం రివాజుగా మారింది. మాజీ ఓపెనర్ హేడెన్... టీమిండియా మాజీ సారథి గంగూలీపై, గిల్‌క్రిస్ట్... టెండూల్కర్‌పై అర్థంలేని వ్యాఖ్యానాలు రాశారు. ఈ నేపథ్యంలో కుంబ్లే తాను వాస్తవాలతో పుస్తకం రాస్తానని చెప్పుకొచ్చారు. కేఎస్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయం: కుంబ్లే, శ్రీనాథ్ కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో తిరిగి పోటీ చేయబోమని అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ వెల్లడించారు. క్రికెట్ అభివృద్ధికి పాటుపడే కొత్త కార్యవర్గానికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్లిద్దరూ స్పష్టం చేశారు.