నేనూ రాస్తా... అందులో తెలుస్తాయన్నీ!
బెంగళూరు: మంకీగేట్ ఉదంతంపై త్వరలో తాను ఓ పుస్తకం రాస్తానని అందులోనే వాస్తవాలన్నీ తెలుస్తాయని భారత దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పారు. అప్పటి టీమిండియాకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. సిడ్నీ టెస్టులో భజ్జీ-సైమో వివాదంపై పాంటింగ్ తన పుస్తకంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత్రను ప్రశ్నించిన సంగతి విదితమే.. దీనిపై స్పందించిన కుంబ్లే ‘ఐదేళ్ల క్రితం జరిగిన ఉదంతం గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి.
కానీ నేనిప్పుడు దానిపై వ్యాఖ్యనించను. అయితే దీనిపై వాస్తవాలతో ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉంది. నిజానిజాలేమిటో తెలుసుకోవాలనుకుంటే నా పుస్తకం కోసం వేచి చూడండి’ అని అన్నారు. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ‘స్వీయచరిత్ర’ పుస్తకాల్లో భారత ఆటగాళ్లపై, బోర్డు అధికారులపై విమర్శలు గుప్పించడం రివాజుగా మారింది. మాజీ ఓపెనర్ హేడెన్... టీమిండియా మాజీ సారథి గంగూలీపై, గిల్‌క్రిస్ట్... టెండూల్కర్‌పై అర్థంలేని వ్యాఖ్యానాలు రాశారు. ఈ నేపథ్యంలో కుంబ్లే తాను వాస్తవాలతో పుస్తకం రాస్తానని చెప్పుకొచ్చారు.
కేఎస్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయం: కుంబ్లే, శ్రీనాథ్
కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో తిరిగి పోటీ చేయబోమని అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ వెల్లడించారు. క్రికెట్ అభివృద్ధికి పాటుపడే కొత్త కార్యవర్గానికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్లిద్దరూ స్పష్టం చేశారు.