
బెంగళూరు: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఇస్తుందనే అశాభావాన్ని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తం చేశాడు. అయితే ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేనందున యువ క్రికెటర్లు కేవలం 4-5 మ్యాచ్‌ల్లోనే తామేంటో నిరూపించుకోవాలని సారథి విరాట్ కోహ్లి పేర్కొన్న సందర్భంలో ధావన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లకు సీనియర్లైన తాము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ధావన్ స్పష్టం చేశాడు.
‘సీనియర్ క్రికెటర్లైన మేము యువ ఆటగాళ్లు బ్యాటింగ్/బౌలింగ్ చేసేటప్పుడు వారిపై ఒత్తిడి లేకుండా చూస్తాం. పంత్ లేక శ్రేయాస్ అయ్యర్ వంటి యువ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అవతలి ఎండ్‌లో ఉండే సీనియర్లు వారితో చర్చించడం వలన వాళ్లు స్వేచ్చగా ఆడతారు. యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవతలి బ్యాట్స్‌మెన్‌తో కమ్యునికేషన్ ఎంతో ముఖ్యం. బ్యాటింగ్ మధ్యలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ చర్చించుకుంటే ఒత్తిడి ఉండదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో బ్యాటింగ్ చేసేటప్పుడు వారితో నేను ఎక్కువగా చర్చిస్తాను. వారితో కలిసి బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. వారు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్రత్యర్థి ఆటగాళ్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. దీంతో అవతలి ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మెన్‌పై కాస్త ఒత్తిడి ఉంటుంది.
నమ్మకం, విశ్వాసం ఉంది..
ఇక ప్రస్తుత సిరీస్‌లో యువ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ ఆరంభంలోనే తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. దీపక్ చహర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. అద్భుత పేస్ సాధిస్తున్నాడు. దీపక్ చహర్ ప్రపంచకప్ వరకు మరింత రాటుదేలుతాడనే నమ్మకం ఉంది. ఇక నా బ్యాటింగ్‌పై సంతృప్తిగా ఉన్నాను. నాలుగైదు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన నా బ్యాటింగ్‌లో లోపం ఉన్నట్టు కాదు. ఇప్పటివరకు మంచి క్రికెట్ ఆడాననే నమ్మకం.. భవిష్యత్‌లోనూ దేశం తరుపున మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాననే విశ్వాసం ఉంది’అంటూ ధావన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment