చల్ల చల్లని కూల్ కూల్ | Dhoni plots India's great escape in Bangalore heartstopper | Sakshi
Sakshi News home page

చల్ల చల్లని కూల్ కూల్

Published Thu, Mar 24 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

చల్ల చల్లని కూల్ కూల్

చల్ల చల్లని కూల్ కూల్

మాయాజాలం  చూపించిన ధోని
ఒత్తిడిలోనూ  తలవంచని తీరు
భారత్‌ను గెలిపించిన  వ్యూహ చతురత

 
 మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. బౌలర్ పాండ్యాకి అనుభవం లేదు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ఇక భారత్ ఓటమి ఖాయమని అందరికీ అర్థమయింది. అయినా కెప్టెన్ ధోని పట్టువదలకుండా పోరాడాలంటూ సహచరుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు. ప్రతి బంతికీ బౌలర్ దగ్గరకి వెళ్లి ఏం చేయాలో చెబుతున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ చివరి క్షణాల్లో ధోని మాస్టర్‌మైండ్ చూస్తే అర్థమవుతుంది... ఎందుకతను భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్ అయ్యాడో.

ఇన్నింగ్స్ ఆఖరి బంతి వేయడానికి ముందు కీపర్ ధోని కుడి చేతి గ్లౌవ్ తీసేశాడు. సాధారణంగా నిలుచునే స్థానంలో కాకుండా... ఐదడుగులు ముందుకు వచ్చి నిలబడ్డాడు. బంతి వికెట్లకు దూరంగా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో అది తన దగ్గరకు రావాలి. రనౌట్ చేయాలనేది వ్యూహం. ఈ ట్రాప్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ పడ్డారు. మరో కీపర్ అయితే బంతిని వికెట్లకు విసిరేవాడు. కానీ ధోని ముందే ఊహించాడు కాబట్టి పరిగెడుతూ వచ్చి బెయిల్స్ పడగొట్టాడు. ఇదీ ఆటగాడిగా తనకున్న అనుభవం.  బంగ్లాదేశ్‌పై భారత్ సంచలన విజయం సాధించడంలో అందరికంటే కీలక పాత్ర ధోనిదే.  తన దగ్గర వనరులన్నీ కరిగిపోతున్నా ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా సారథిగా జట్టును గెలిపించాడు.

 
 
 బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి  బంగ్లాదేశ్‌పై భారత్ విజయంలో ధోని చేసిన రెండు స్టంపింగ్స్, చివరి ఓవర్లో తన చతురతదే ప్రధాన పాత్ర. వికెట్ ఎలా ఉన్నా 146 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. బౌలర్లు కూడా ధోని ఆలోచనలకు తగినట్లుగా స్పందించారు. మూడు ఓవర్ల తొలి స్పెల్‌లో అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తొలి వికెట్ తీసి శుభారంభం ఇచ్చాడు. తమీమ్ చెలరేగుతున్న వేళ జడేజాతో బౌలింగ్ చేయించి తొలి ఓవర్లోనే స్టంపవుట్‌కు పురిగొల్పడం అద్భుతంగా పని చేసింది. రైనానుంచి కూడా ధోని అదే ఫలితం సాధించాడు.

ఈ సారి షబ్బీర్‌ను స్టంప్ చేయడంలో అతని కీపింగ్‌లో అద్భుతం కనిపించింది. మళ్లీ రెండు సిక్సర్లు బాది ఊపు మీదున్న షకీబ్‌ను ఆపేందుకు అశ్విన్‌ను తీసుకు రావడం, అతను తొలి బంతికే వికెట్ తీయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచడం సాధారణంగా ఎవరూ ఊహించనిది. కానీ ధోని వ్యూహాలు అలాంటివి. ఏడు ఓవర్ల ముందే తన ప్రధాన బౌలర్ కోటా ముగించేయడం చూస్తే ఇకపై వేయాల్సిన ఓవర్ల గురించి కెప్టెన్‌కు స్పష్టత ఉందని అర్థమవుతుంది. పాండ్యా చివరి ఓవర్ వేయాల్సి వస్తుందని అతను ముందే సిద్ధమైనట్లున్నాడు.

 కుర్రాళ్లకు అండగా...: తొలి బంతికే మిస్ ఫీల్డ్, ఆ తర్వాత సునాయాస క్యాచ్ వదిలేయడం, ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు... ఇలా అన్ని రకాలుగా ఒత్తిడిలో ఉన్న బుమ్రాను ధోని నిరుత్సాహ పరచలేదు. ‘జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇక్కడే అర గంట ఏడ్చినా అతను అవుట్ కాడు. మన ప్రణాళిక అమలు చేయడం ముఖ్యం అని అతడితో మాట్లాడాను’ అని ధోని చెప్పడం ఒక యువ బౌలర్‌పై ఎలా నమ్మకం ఉంచాడనేదానికి నిదర్శనం. అదే ప్రోత్సాహంతో 19వ ఓవర్లో మళ్లీ చెలరేగిన బుమ్రా మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. ఇక చివరి ఓవర్ పాండ్యాకు అప్పగించే ముందయితే చర్చోపచర్చలు.

ఈ సమయంలో పాండ్యాలో ధైర్యం నింపిన ధోని, ప్రతీ బంతి గురించి జాగ్రత్త తీసుకున్నాడు. చివరి బంతి కోసమైతే పాండ్యా బలం, బలహీనతపై కూడా దృష్టి పెట్టి బాధ్యత అప్పగించాడు. ‘పాండ్యా యార్కర్లు బాగా వేయలేడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యార్కర్‌కు ప్రయత్నించవద్దని మాత్రం స్పష్టం చేశాను. వైడ్ కాకుండా లెంగ్త్ బాల్ వేస్తే చాలని అనుకున్నాం.   అది అద్భుతంగా పని చేసింది.  ఇంత గందరగోళం మధ్యలో పరిస్థితిని చక్కబెట్టడమే విజయ రహస్యం’ అని ధోని అన్నాడు.

పాండ్యా, బుమ్రాలు తొలిసారి ఇంత ఒత్తిడిలో ఆడారని, వారు భవిష్యత్తులో నేర్చుకుంటారని కూడా కెప్టెన్ మరింత ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. ధోని నాయకత్వంలో భారత్ గొప్ప, చిరస్మరణీయ విజయాలు సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ కొన్ని హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. చాలా సందర్భాల్లో బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించిన ధోని... ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వందకు వంద మార్కులు సంపాదించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement