
ప్రతిసారీ కొత్త చాంపియన్
గత మూడు వరల్డ్‌కప్‌లలో వేర్వేరు విజేతలు
రెండుసార్లు ఫైనల్స్‌లో ఓడిన శ్రీలంక
భారత్‌కు అన్నింటా నిరాశే
మొదటి ప్రపంచ కప్ విజయవంతం కావడంతో ఆ తర్వాతి వరల్డ్ కప్ టోర్నీలపై సహజంగానే ఆసక్తి పెరిగింది. భారత్ డిఫెండింగ్ చాంపియన్ కావడం, అంతకు ముందు ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను ఊపేయడంతో టి20 క్రేజ్ అమాంతం ఆకాశాన్నంటింది.
ఇదే క్రమంలో అనేక మంది యువ క్రికెటర్లు, స్టార్లు పుట్టుకొచ్చారు. లీగ్ స్థాయి టోర్నీలో ఎంత చెలరేగినా... జాతీయ జట్టు తరఫున సత్తా చాటి హీరోలుగా మారేందుకు ఆటగాళ్లకు వరల్డ్ కప్‌లు సరైన వేదికగా నిలిచాయి. 2009, 2010, 2012లలో జరిగిన వరల్డ్ కప్‌లలో మూడు వేర్వేరు జట్లు విజేతలుగా నిలవడం విశేషం.
తొలి సారి చివరి మెట్టుపై చతికిలపడిన పాకిస్థాన్ తర్వాతి టోర్నీని సాధించడం, క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలి ఐసీసీ టైటిల్ నెగ్గడం, 29 ఏళ్ల తర్వాత విండీస్‌కు వరల్డ్ కప్ యోగం పట్టడం ఈ మూడు టోర్నీల విశేషాలు.
అయితే ధోని సారథ్యంలో తొలి సారి విజేతగా నిలిచిన టీమిండియా అదే కెప్టెన్ నేతృత్వంలో ఆ తర్వాత అంచనాలు నిలబెట్టుకోలేకపోయింది. ఐపీఎల్‌లో మన ఆటగాళ్లు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఆ అనుభవం వరల్డ్ కప్ మ్యాచ్‌లకు పనికి రాలేదు. ఫలితంగా గత మూడు టోర్నీల్లోనూ భారత్ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండా దాదాపు ఒకే తరహా ఫలితాన్ని పునరావృతం చేసింది.
2009 ప్రపంచ కప్
వేదిక: ఇంగ్లండ్ విజేత: పాకిస్థాన్ పాల్గొన్న జట్లు: 12
సెమీస్‌కు చేరిన జట్లు: పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
ఫైనల్: లార్డ్స్ మైదానంలో ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం పాక్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 139 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: తిలకరత్నే దిల్షాన్
భారత్ ప్రదర్శన: లీగ్ దశలో ఐర్లండ్, బంగ్లాదేశ్‌లను ఓడించి భారత్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ చేతుల్లో ఓడి ఒక్క విజయం లేకుండానే నిష్ర్కమించింది. టోర్నీకి ముందే సెహ్వాగ్ గాయంతో స్వదేశం తిరిగి రావడం జట్టుపై ప్రభావం చూపించింది.
విశేషాలు:
ఇంగ్లండ్ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్‌కు బాదుడు సాధ్యం కాలేదు. చక్కటి ప్రదర్శనతో బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఫలితంగా సిక్స్‌ల సంఖ్య తగ్గింది. గత టోర్నీలో 265 సిక్స్‌లు బాదితే, ఈ సారి అది 166కే పరిమితమైంది.
లీగ్ దశలో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది.
వెస్టిండీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఓవర్లోనే శ్రీలంక బౌలర్ మాథ్యూస్ 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
కివీస్‌పై పాక్ బౌలర్ ఉమర్‌గుల్ 6 పరుగులకే 5 వికెట్లు తీశాడు. దిల్షాన్ ఈ టోర్నీలో పదే పదే ప్రయోగించి కొత్త తరహా షాట్ దిల్‌స్కూప్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చాడు.
తొలి సారి మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభమైంది.
మహిళా ప్రపంచ కప్ విజేత: ఇంగ్లండ్
2010 ప్రపంచ కప్
వేదిక: వెస్టిండీస్ విజేత: ఇంగ్లండ్ పాల్గొన్న జట్లు: 12
సెమీస్‌కు చేరిన జట్లు: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక
ఫైనల్: బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తుది పోరులో ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసి తొలి సారి ఐసీసీ టైటిల్ అందుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: కెవిన్ పీటర్సన్
భారత్ ప్రదర్శన: గత వరల్డ్ కప్‌కు జిరాక్స్ కాపీలాగే ఈ టోర్నీలోనూ భారత్ ప్రదర్శన సాగింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్‌లపై గెలిచి సూపర్ ఎయిట్‌కు చేరింది. అక్కడ ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌ల చేతిలో ఓడి వెనుదిరిగింది.
విశేషాలు:
సంవత్సరానికి కనీసం ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలన్న ప్రసారకర్తల ఒప్పందం మేరకు ఒక్క ఏడాదికే (9 నెలలకే జరిగింది) టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సి వచ్చింది. భారత్‌లో టీవీ ప్రసారాల అనుకూలత కోసం వెస్టిండీస్‌లో ఉదయం 9.30కే మ్యాచ్‌లు నిర్వహించడం అక్కడి అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.భారత క్రికెటర్లు పబ్‌లో అభిమానులతో గొడవపడ్డారు. సురేశ్ రైనా భారత్ తరఫున టి20ల్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్‌గా అవతరించాడు.
తీవ్రవాద నీడలోంచి బయటపడి అఫ్ఘానిస్థాన్ ఈ టోర్నీతోనే తొలి సారి ఒక టెస్టు జట్టుతో (భారత్) తలపడే అవకాశం దక్కించుకుంది. పాక్‌తో సెమీ ఫైనల్లో మైక్ హస్సీ టి20 చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 నాటౌట్) ఆడటం ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.
మహిళా ప్రపంచ కప్ విజేత: ఆస్ట్రేలియా
2012 ప్రపంచ కప్
వేదిక: శ్రీలంక విజేత: వెస్టిండీస్ పాల్గొన్న జట్లు: 12
సెమీస్‌కు చేరిన జట్లు: వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
ఫైనల్: కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలడంతో సొంతగడ్డపై వారికి నిరాశే ఎదురైంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: షేన్ వాట్సన్
భారత్ ప్రదర్శన: గత రెండు టోర్నీలతో పోలిస్తే ఈ సారి ధోని సేన కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చినా సెమీస్‌కు మాత్రం చేరలేకపోయింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్‌లపై జట్టు నెగ్గింది. సూపర్ ఎయిట్‌లో కూడా పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలను ఓడించినా ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడటంతో రన్‌రేట్‌లో వెనుకబడి తప్పుకుంది.
విశేషాలు
తొలిసారి ఈ టోర్నీలో సూపర్ ఓవర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌తోనే రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం విశేషం.
బంగ్లాదేశ్‌పై బ్రెండన్ మెకల్లమ్ సూపర్ సెంచరీ (58 బంతుల్లో 123) హైలైట్‌గా నిలిచింది.
అజంతా మెండిస్ జింబాబ్వేపై 8 పరుగులకు 6 వికెట్లు తీసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
షేన్ వాట్సన్ వరుసగా నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మహిళా ప్రపంచ కప్ విజేత: ఆస్ట్రేలియా