ముంబై: ఎదురులేని ఆటతో వరల్డ్‌కప్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి దూసుకుపోతున్న భారత జట్టు ఇప్పుడు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే పోరులో మాజీ విశ్వవిజేత శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఒకవైపు భారత్ అజేయంగా చెలరేగుతుండగా, మరోవైపు శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. మూడు పరాజయాల తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడటం వారిని తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగియవచ్చు.
మార్పుల్లేకుండా...
భారత జట్టు విషయంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం, అవసరం కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. ఇంగ్లండ్‌తో పోరులో జట్టు బ్యాటింగ్ కాస్త తడబడినట్లుగా కనిపించినా... అది పూర్తిగా భిన్నమైన, కఠినమైన పిచ్ కావడం మన బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. కానీ అది పునరావృతం కాకుండా మన ఆటగాళ్లు చెలరేగిపోగలరు. అయితే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ మాత్రమే కాస్త సమస్యగా కనిపిస్తోంది. బుమ్రా, షమీల ప్రమాదకరమైన బౌలింగ్... స్పిన్‌లో జడేజా, కుల్దీప్‌ల జోరు భారత్‌ను దుర్బేధ్యంగా మారుస్తున్నాయి.
మాథ్యూస్‌పై ఆశలు...
ఒకవైపు ఆట పేలవంగా ఉండటంతో పాటు మరోవైపు కీలక ఆటగాళ్లకు వరుస గాయాలు శ్రీలంకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో తుది జట్టులో వరుసగా మార్పులు చేయాల్సి ఉంది. అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సీనియర్ ఎంజెలో మాథ్యూస్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. 54 సగటుతో అతను మూడు సెంచరీలు కూడా సాధించాడు. అదే ఆటను మళ్లీ చూపించాలని లంక కోరుకుంటోంది.
బౌలింగ్‌లో అందరూ అంతంతమాత్రమే. రజిత, తీక్షణ, మదుషంకలాంటి జూనియర్లు భారత బ్యాటింగ్ బలగాన్ని నిలువరించడం చాలా కష్టం. మొదటి నుంచి వాంఖెడే మైదానం పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఈ టోర్నీలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 399, 382 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment