న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన దీపా కర్మాకర్కు క్రీడల శాఖ ప్రోత్సాహకం ప్రకటించింది. ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.30 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అయితే ఆ చిన్న మొత్తం దీపా కర్మాకర్ ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొనేందుకు సరిపోతాయా అనేది ప్రశ్నార్థకమే.
కాగా త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది.