సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం, టిక్కెట్ల కుంభకోణం తదితర అంశాలపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న బృందంలోని అధికారులెవ్వరినీ బదిలీ చెయ్యొద్దని హైకోర్టు ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఫిబ్రవరి 28 నాటికి దర్యాప్తు పూర్తి చేస్తామని మౌఖికంగా చెప్పొద్దని, రాతపూర్వకంగా ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచాలని ఏసీబీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలపై సాగర్ క్లబ్ కార్యదర్శి సి.బాబురావ్ సాగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2011లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 2011 ఏప్రిల్ 13న... 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, నిందితుల్లో ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతు బాబూరావ్‌సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులెవ్వరినీ కూడా బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 10కి వాయిదా వేశారు.
దర్యాప్తు అధికారులెవ్వరినీ బదిలీ చేయవద్దు...
Published Thu, Jan 30 2014 1:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement