
కోచ్ ఎవరైతే ఏంటి: కుంబ్లే
ముంబై: అనుభవం, యువ ఆటగాళ్ల మేలికలయికతో భారత క్రికెట్ జట్టు సమతూకంగా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి జట్టుకు శిక్షకుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు. కోచ్ గురించి మాట్లాడాల్సిన పనిలేదని.. ఆటగాళ్లు, జట్టు గురించే ఆలోచించాలని పేర్కొన్నాడు.
'కోచ్ నేనా, రవిశాస్త్రా అన్నది పక్కనపెట్టండి. టీమిండియా బాగా ఆడాలని అందరూ కోరుకోవాలి. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదో గొప్ప అవకాశం. ఏడాది పాటే నన్ను కోచ్ గా నియమించినందుకు బాధ లేదు. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తా'నని కుంబ్లే చెప్పాడు.
కాగా, భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా 18 నెలల పాటు పని చేసిన తనను ప్రధాన కోచ్‌గా నియమించకపోవడంతో రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డెరైక్టర్‌గా తను ఉన్న సమయంలో భారత జట్టు అనేక చిరస్మరణీయ విజయాలు అందుకుందని గుర్తు చేశారు. కోచ్‌గా తనని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.