'చాంపియన్'లా వేటాడారు | Dominant India set up blockbuster Pakistan final | Sakshi
Sakshi News home page

'చాంపియన్'లా వేటాడారు

Published Fri, Jun 16 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

'చాంపియన్'లా వేటాడారు

'చాంపియన్'లా వేటాడారు

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌
సెమీస్‌లో 9 వికెట్లతో బంగ్లాదేశ్‌ చిత్తు
రోహిత్‌ శర్మ సెంచరీ, కోహ్లి 96 నాటౌట్‌
ఆదివారం పాక్‌తో తుది పోరు


అద్భుతాలు లేవు. అనూహ్యానికి అవకాశమే కనిపించలేదు. సంచలనం అనేది అందనంత దూరంలో ఉండిపోయింది. అలవోకగా, అలసట అన్నదే దరి చేరకుండా, తమకు అలవాటైన రీతిలో భారత్‌ మరో అతి సునాయాస విజయాన్ని అందుకుంది. అది మామూలు మ్యాచ్‌ అయినా, ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌ అయినా తమకు ఒకటే అన్నట్లుగా మనోళ్లు చెలరేగిపోయారు. కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇదీ ఆటంటే అన్నట్లుగా బంగ్లా ఆటగాళ్లను భారత త్రయం ఒక ఆటాడుకుంది. మరో చోట ఎలా గెలిచినా మన ముందు మాత్రం ఇంకా బంగ్లా బేబీలేనని భారత్‌ నిరూపించింది.

తమీమ్, ముష్ఫికర్‌ భాగస్వామ్యం బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు అండగా నిలిస్తే... ‘ట్రంప్‌ కార్డ్‌’ కేదార్‌ జాదవ్‌ జాదూతో మళ్లీ కోలుకున్న భారత్, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా కట్టి పడేసింది. ఆ తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి డిఫెండింగ్‌ చాంపియన్‌ సత్తానుప్రదర్శించింది. రోహిత్‌ శర్మ సెంచరీ, కోహ్లి క్లాసిక్‌తో పాటు శిఖర్‌ ధావన్‌ మెరుపులు వరుసగా రెండోసారి  చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాయి.

ఇక సాధారణ క్రికెట్‌ అభిమాని కలలు గనే పోరుకు రంగం సిద్ధమైంది. ఒక ఐసీసీ టోర్నీ తుది పోరులో భారత్, పాకిస్తాన్‌ తలపడటం అంటే ఫ్యాన్స్‌కు కనులవిందు. పదేళ్ల తర్వాత ఈ దాయాదుల పోరుతో  మరో ‘బ్లాక్‌ బస్టర్‌ సండే’కు అంతా సిద్ధం కండి.  

బర్మింగ్‌హామ్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. చాంపియన్స్‌ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మరో విజ యం దూరంలో నిలిచింది. గురువారం ఇక్కడ జరిగి న రెండో సెమీఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ (82 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ముష్ఫికర్‌ (85 బంతుల్లో 61; 4 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. జాదవ్, బుమ్రా, భువనేశ్వర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 40.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 265 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (129 బంతుల్లో 123 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి అజేయ సెంచరీ సాధించగా... కోహ్లి (78 బంతుల్లో 96 నాటౌట్‌; 13 ఫోర్లు) అండగా నిలిచాడు. శిఖర్‌ ధావన్‌ (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది.

భారీ భాగస్వామ్యం...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. భువనేశ్వర్‌ వేసిన చివరి బంతికి సౌమ్య సర్కార్‌ (0) బౌల్డ్‌ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న తమీమ్‌ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకోగా, షబ్బీర్‌ రహమాన్‌ (19) వచ్చీ రాగానే చకచకా ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. భువీ, బుమ్రా బౌలింగ్‌లో అతను రెండేసి బౌండరీలు బాదాడు. అయితే ఆ తర్వాత భారత్‌ చక్కటి బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేసింది. వరుసగా 13 బంతుల పాటు ఒక్క పరుగు కూడా రాలేదు. దాంతో అసహనం పెరిగిన షబ్బీర్, భువీ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అనంతరం ముష్ఫికర్‌ కూడా దూకుడు ప్రదర్శించాడు. భువీ ఓవర్లో వరుసగా అతను మూడు ఫోర్లు కొట్టడం విశేషం. పాండ్యా ‘నోబాల్‌’తో అదృష్టవశాత్తూ బతికిపోయిన తమీమ్, ముష్ఫికర్‌ కలిసి ఆ తర్వాత జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు భారత ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను సమర్థంగా ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో తమీమ్‌ 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు తగ్గించని తమీమ్, అశ్విన్‌ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు 61 బంతుల్లో ముష్ఫికర్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తయింది. ఇలాంటి స్థితిలో కేదార్‌తో బౌలింగ్‌ చేయించడం ఆటను మలుపు తిప్పింది. జడేజా బౌలింగ్‌లో ధోని అద్భుతమైన క్యాచ్‌కు షకీబ్‌ (15) వెనుదిరగ్గా, మొసద్దిక్‌ (15) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 4 పరుగుల వద్ద అశ్విన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన మహ్ముదుల్లా (21) కొన్ని పరుగులు జోడించగా... చివర్లో కెప్టెన్‌ మొర్తజా (25 బంతుల్లో 30 నాటౌట్‌; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. చివరి 10 ఓవర్లలో బంగ్లా 57 పరుగులు చేసింది.  

ఓపెనర్ల శుభారంభం...
ఛేదనలో భారత్‌ ఆరంభం నుంచే సాధికారికంగా ఆడింది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ బంగ్లా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వేగంగా పరుగులు సాధించారు. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో ధావన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో భారత్‌ దూకుడు మొదలైంది. ముస్తఫిజుర్‌ తర్వాతి ఓవర్లో రోహిత్‌ ఇదే తరహాలో మరో రెండు బౌండరీలు బాదాడు. తస్కీన్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో భారత్‌ 16 పరుగులు రాబట్టింది. అయితే తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ను మొర్తజా అవుట్‌ చేయడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. అయితే జోరు తగ్గించని రోహిత్, షకీబ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లు పదే పదే షార్ట్, వైడ్‌ బంతులు వేయడంతో రోహిత్, కోహ్లి ఏమాత్రం ఇబ్బంది పడకుండా అలవోకగా పరుగులు రాబట్టారు. రూబెల్‌ బౌలింగ్‌లో రోహిత్, ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో కోహ్లి వరుసగా రెండేసి బౌండరీలు కొట్టారు.

రూబెల్‌ మరో ఓవర్లో భారత్‌ మూడు ఫోర్లతో 17 పరుగులు పిండుకుంది. ఇదే ఉత్సాహంతో కోహ్లి 42 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరో వైపు తన ధాటిని కొనసాగించిన రోహిత్, ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత భారత్‌కు ఎదురు లేకుండా పోయింది.  చివర్లో కోహ్లికి సెంచరీ చేసే అవకాశం వచ్చినా... అతను అంతగా పట్టించుకోకుండా విజయంపైనే దృష్టి పెట్టాడు. 300వ మ్యాచ్‌ ఆడిన యువరాజ్‌ సింగ్‌కు బ్యాటింగ్‌ అవకాశం మాత్రం రాలేదు.

కేదార్‌ పంచ్‌...
కొన్నాళ్ల క్రితమే కివీస్‌పై అనూహ్య బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కేదార్‌ జాదవ్‌ ఈ సారి కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత ఐదో బౌలర్‌ పాండ్యా 3 ఓవర్లలో 28 పరుగులు ఇవ్వడంతో మరో ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. ఈ దశలో జాదవ్‌ స్లో ఆఫ్‌ స్పిన్‌ భారత్‌కు కీలక వికెట్లు అందించింది. ముందుగా జాదవ్‌ వేసిన బంతిని స్లాగ్‌ స్వీప్‌ ఆడబోయిన ప్రధాన బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయే ప్రయత్నం చేసిన ముష్ఫికర్, మిడ్‌ వికెట్‌లో కోహ్లికి సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. ఆ సమయంలో కోహ్లి ప్రదర్శించిన హావభావాలు ఈ వికెట్‌ విలువను చూపించాయి.

రెండు నోబాల్స్‌...
పాండ్యా వేసిన 13వ ఓవర్లో రెండు నోబాల్స్‌ పడ్డాయి. రెండో బంతిని తమీమ్‌ మిడాన్‌ వైపుగా ఆడాడు. ఆ సమయంలో 30 గజాల సర్కిల్‌ లోపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటంతో అంపైర్లు దానిని నోబాల్‌గా ప్రకటించారు. మరో మూడు బంతుల తర్వాత పాండ్యా బంతిని తమీమ్‌ వికెట్లపైకి ఆడుకున్నాడు. అయితే ఈసారి పాండ్యా గీత దాటడంతో తమీమ్‌ బతికిపోయాడు. ఆ సమయంలో అతని స్కోరు 17 పరుగులు. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్లో ధోని కారణంగా బంగ్లాకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. లాంగ్‌లెగ్‌ నుంచి ఫీల్డర్‌ విసిరిన బంతిని అందుకునేందుకు ధోని ముందుగానే తన గ్లవ్స్‌ను విసిరేశాడు. ఆ తర్వాత వచ్చిన బంతిని వికెట్లపైకి తోసే క్రమంలో బంతి నేలపై ఉన్న గ్లవ్స్‌కు తాకింది. దాంతో భారత్‌కు ఐదు పరుగుల జరిమానా పడింది.

పదేళ్ల తర్వాత...
భారత్, పాక్‌ ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకోవడం అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని క్షణం. ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో మాత్రం ఇరు జట్ల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. అయితే నాటితరం అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే మ్యాచ్‌ 1985లో మెల్‌బోర్న్‌లో జరిగింది. అప్పట్లో 7 ప్రధాన జట్లు పాల్గొని దాదాపు ప్రపంచకప్‌లాగే సాగిన ‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌’ ఫైనల్లో భారత్‌ 8 వికెట్లతో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

1 వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి, తక్కువ ఇన్నింగ్స్‌లలో (175) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

11 రోహిత్‌ కెరీర్‌లో ఇది 11వ సెంచరీ

1 చాంపియన్స్‌ ట్రోఫీలో గంగూలీ (665)ని అధిగమించి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ధావన్‌ (680) నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement