
కరెంటు లేక వాయిదా పడ్డ మూడో రౌండ్
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్... 15 దేశాల నుంచి గ్రాండ్‌మాస్టర్లు... భారత దేశంలోని ప్రముఖ చెస్ క్రీడాకారులతో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది చిన్నారులు... ఒకేసారి సుమారు 70 బోర్డుల మీద గేమ్‌లు... యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో దృశ్యం ఇది.
అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీలో భాగంగా మంగళవారం మూడో రౌండ్ గేమ్‌లు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం గం. 2.30కు గేమ్‌లు మొదలయ్యాయి. గంట తర్వాత గం. 3.30 ప్రాంతంలో కరెంటు పోయింది. అంతా అంధకారం. గంట గడిచింది. అయినా కరెంటు రాలేదు. దీంతో గం. 4.30 ప్రాంతంలో ఈ రౌండ్ మ్యాచ్‌లను రద్దు చేశారు. బుధవారం మూడు, నాలుగు రౌండ్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.
నగరంలో ఒక్క గచ్చిబౌలిలో మినహా ఏ స్టేడియంలోనూ జనరేటర్ సౌకర్యం లేదు. కాబట్టి పెద్ద టోర్నీలు ఏవైనా జరిగితే కరెంటు తీయకుండా మాట్లాడుకుంటారు లేదా జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ టోర్నీ నిర్వాహకులు మాత్రం మరచిపోయారు. విదేశాల నుంచి వచ్చిన గ్రాండ్‌మాస్టర్లు దీని గురించి ఏమనుకుంటారో...!
ఫలితాలూ ఆలస్యమే
షెడ్యూల్ ప్రకారం తొలి రోజు సోమవారం రెండు రౌండ్‌లు జరిగాయి. కానీ నిర్వాహకులు ఒక్క రౌండ్ ఫలితాలే మీడియాకు ఇచ్చారు. మంగళవారం రెండో రౌండ్ జరిగినట్లు ఫలితాలు ఇచ్చారు. కానీ వాస్తవానికి తొలిరోజే రెండో రౌండ్ గేమ్‌లు కూడా జరిగాయి. రెండో రౌండ్ ముఖ్య ఫలితాలను కూడా ‘సాక్షి’ ప్రచురించింది. కానీ మూడో రౌండ్ సందర్భంగా కరెంటు లేక గందరగోళం జరిగిన విషయం తెలియకుండా... గేమ్‌లు జరిగినట్లు, అది కూడా ముందు రోజు ఫలితాలను ఇవ్వడం ద్వారా నిర్వాహకులు ఎవరిని మభ్యపెడదామని అనుకుంటున్నారో వారికే తెలియాలి.