
డచ్ ఢమాల్!
నెదర్లాండ్స్ 39 ఆలౌట్
అంతర్జాతీయ టి20ల్లో అత్యల్ప స్కోరు
9 వికెట్లతో శ్రీలంక ఘన విజయం
సరిగ్గా మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ జట్టు టి20 క్రికెట్‌లో పలు ప్రపంచ రికార్డులు తిరగరాసింది. సోమవారం ఆ జట్టు మళ్లీ రికార్డు పుస్తకాల్లో మరోసారి తమ పేరును లిఖించుకుంది. అయితే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్! అనూహ్య రీతిలో అత్యంత చెత్త ప్రదర్శనతో నెదర్లాండ్స్ రికార్డులకెక్కింది. ఘోరమైన ఆటతీరుతో టి20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసి శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. గత మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై తొలి 63 బంతుల్లో 150 పరుగులు చేసిన డచ్ బృందం ఇప్పుడే అదే 63 బంతుల్లో 39 పరుగులకే చేతులెత్తేసింది.
భళా... శ్రీలంక
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడంలో శ్రీలంకకు మంచి రికార్డే ఉంది. వన్డేల్లో తొలి మూడు అత్యల్ప స్కోర్లు లంకపైనే రావడం విశేషం. జింబాబ్వే (35), కెనడా (36), జింబాబ్వే (38)...జట్లు శ్రీలంక చేతిలోనే కుప్పకూలాయి.
చిట్టగాంగ్: సున్నాకు తొలి వికెట్... 1/2... 1/3... 9/4... ఈ తరహాలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సాగింది. లంక పదునైన బౌలింగ్ ముందు ఒక్క డచ్ బ్యాట్స్‌మన్ కూడా నిలబడలేకపోయాడు. ప్రమాదకరమైన బంతులు లేకపోయినా నిర్లక్ష్యంగా ఆడి ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ముగిసేసరికి డచ్ 4 వికెట్లు కోల్పోయి 15 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫ్లడ్‌లైట్లు పని చేయకపోవడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. బహుశా ఆ సమయమే హాలండ్ వికెట్ల పతనానికి విరామం లభించింది. ఆ తర్వాత దాదాపు ప్రతీ ఓవర్లో హాలండ్ వికెట్ కోల్పోతూనే ఉంది. ఐర్లాండ్‌పై చెలరేగి ఆడిన జట్టు ఇదేనా అనిపించేంత దారుణంగా ఆ జట్టు ప్రదర్శన కనబర్చింది. మాథ్యూస్, మలింగ, మెండిస్... ముగ్గురూ ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టి నెదర్లాండ్స్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌటైంది. టామ్ కూపర్ (18 బంతుల్లో 16; 2 ఫోర్లు) మినహా అంతా ఒక్క అంకెకే పరిమితం కాగా...ఐదుగురు బ్యాట్స్‌మెన్ సున్నాతోనే సరిపెట్టారు.
40 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక సరిగ్గా 5 ఓవర్లలో పెరీరా (14) వికెట్ కోల్పోయి ఛేదించింది. దిల్షాన్ (12 నాటౌట్), జయవర్ధనే (11 నాటౌట్) అజేయంగా నిలిచారు.
అంతర్జాతీయ టి20ల్లో ఇదే (39) అత్యల్ప స్కోరు. 2013లో కెన్యా (56) జట్టు అఫ్ఘానిస్థాన్‌పై చేసిన రికార్డును హాలండ్ సవరించింది.
ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2009లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర 30 పరుగులకే ఆలౌటైంది.
అంతర్జాతీయ టి20ల్లో అతి తక్కువ బంతుల్లో (63) ముగిసిన ఇన్నింగ్స్ ఇదే.
లక్ష్యఛేదనలో మిగిలిన బంతుల (90) ప్రకారం చూస్తే శ్రీలంకదే అతి పెద్ద విజయం. 2012లో ఐర్లాండ్ మరో 76 బంతులు మిగిలి ఉండగానే కెన్యాను ఓడించింది.