ఒలింపిక్ విజేతకు షాక్
- ఎలైన్ థామ్సన్ ఘోర వైఫల్యం
- మహిళల 100 మీటర్ల విజేత టోరీ బోవీ
లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో మరో సంచలనం... ఈసారి మహిళల విభాగంలో! 100 మీటర్ల పరుగులో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఎలైన్ థామ్సన్‌కు పరాభవం ఎదురైంది. కనీసం ఆమె పతకం కూడా గెలవలేకపోయింది. 10.98 సెకన్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టోరీ బోవీ 10.85 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. మారీ జోసీ లౌ (ఐవరీకోస్ట్–10.86సె) రజతం గెలుచుకోగా, షిఫర్స్ (నెదర్లాండ్స్–10.96సె) కాంస్యం నెగ్గింది.
2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 4్ఠ100 రిలేలో స్వర్ణం, 200 మీ. పరుగులో రజతం సాధించిన థామ్సన్... గత ఏడాది రియోలో 100మీ., 200 మీ. రెండింటిలోనూ స్వర్ణాలు సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో రియోలో పరాజయానికి బోవీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 100 మీ. లో రజతం, 200 మీ.లో కాంస్యం గెలుచుకుంది.