కవోరి ఇచో... నాలుగోసారి
రియో డి జనీరో: జపాన్ రెజ్లర్ కవోరి ఇచో వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణాలు గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. 58 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్స్‌లో రష్యన్ రెజ్లర్ కోబ్లోవాను ఓడించి రియో స్వర్ణాన్ని దక్కించుకుంది. మొదటి రౌండ్లో ఇచో వెనకపడ్డప్పటికీ.. అనుభవాన్ని రంగరించి.. రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యాన్ని కనబరిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం (48 కేజీల విభాగంలో) గెలిచిన ఇచో.. ఆ తర్వాత బీజింగ్ (48 కేజీలు), లండన్ (58 కేజీలు)ల్లోనూ పసిడి పతకాలు నెగ్గింది.
థాంప్సన్ సిగలో మరో స్వర్ణం
అనూహ్యంగా మహిళల 100మీటర్ల రేసులో స్వర్ణం గెలిచిన జమైకన్ అథ్లెట్ ఎలైన్ థాంప్సన్.. 200 మీటర్ల రేసులోనూ (21.78 సెకన్లు) బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 22.15 సెకన్లతో డచ్ మహిళ డాఫ్నే షిపర్స్ రజతాన్నందుకుంది. మరోవైపు, పురుషుల 200 మీటర్ల సెమీస్‌లో 19.78 సెకన్ల టైమింగ్‌తో బోల్ట్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో బోల్ట్‌కు ఇదే అత్యుత్తమ టైమింగ్. అమెరికా స్టార్ అథ్లెట్ గాట్లిన్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు.
నెమార్ రికార్డు గోల్
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్ వేగవంతమైన గోల్‌తో ఒలింపిక్స్ చరిత్రపుటల్లోకి ఎక్కాడు. హోండురస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 15 సెకన్లలోనే గోల్‌తో ఈ రికార్డు సాధించాడు. ఈ విజయంతో (6-0) ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆతిథ్య దేశం.. ఫైనల్లో జర్మనీతో తలపడుతుంది.