
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెందిన క్రీడా సంఘాలు తప్పనిసరిగా క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్)ని అమలు చేయాల్సిందేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ‘కోడ్ ప్రకారం ఆయా సంఘాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి’ అని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. 2011 స్పోర్ట్స్ కోడ్‌కు విరుద్ధంగా నడుచుకున్నందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్ర సంఘాల గుర్తింపుని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
చట్ట విరుద్ధంగా ఏ క్రీడా సంఘమైన వ్యవహరించినా, అక్రమాలు, అవకతవకలకు పాల్పడినా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని రాథోడ్ వివరించారు. ఆసియా క్రీడలు ముగిశాక కబడ్డీ సమాఖ్య ఎన్నికలపై దృష్టి సారిస్తామన్నారు.. ‘కబడ్డీ పూర్తిగా శరీర సామర్థ్య క్రీడ. దీనికి క్రీడా సామగ్రి కూడా తక్కువే అవసరముంటుంది. ఇలాంటి గ్రామీణ క్రీడ 30 దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఒలింపిక్స్ ఆటగా అడుగులు వేస్తుంది’ అని చెప్పిన రాథోడ్... రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఫేవరెట్ క్రీడ కబడ్డీ అని తన ప్రసంగాన్ని ముగించారు.