తొలి బెర్త్ ఇంగ్లండ్‌దే
►కివీస్‌పై గెలుపుతో సెమీస్‌లోకి
►రాణించిన బట్లర్, రూట్, హేల్స్
►చాంపియన్స్ ట్రోఫీ
కార్డిఫ్: అందరికంటే ముందుగా ఆతిథ్య జట్టే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’మ్యాచ్‌లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై జయభేరి మోగించింది. మొదట ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 310 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హేల్స్ (62 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫామ్‌లో ఉన్న రూట్ (65 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బట్లర్ (48 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. విలియమ్సన్ (98 బంతుల్లో 87; 8 ఫోర్లు) వీరోచిత పోరాటం చేశాడు. ప్లంకెట్ 4, బాల్, రషీద్ చెరో 2 వికెట్లు తీశారు. వరుసగా రెండో విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది.
మళ్లీ... 300 దాటేసింది
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేసన్ రాయ్ (13), అలెక్స్ హేల్స్ ప్రారంభించారు. అయితే జట్టు స్కోరు 37 పరుగుల వద్ద రాయ్‌ని మిల్నే బౌల్డ్ చేశాడు. ఆరంభంలో నెమ్మదించిన జట్టు స్కోరు... రూట్ రాకతో పరుగుపెట్టింది. రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించాక హేల్స్ కూడా మిల్నే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మోర్గాన్ (13) విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (53 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రూట్స్ మరో ఉపయుక్తమైన భాగస్వామ్యాన్ని అందించారు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జతయ్యాక రూట్... అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం స్టోక్స్... బౌల్ట్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. జట్టు స్కోరు పెంచే ప్రయత్నంలో బట్లర్ ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ స్కోరు 300 దాటింది.
విలియమ్సన్ జోరు
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేన్ విలియమ్సన్ చక్కని పోరాటం చేశాడు. అతను ఉన్నంత సేపు కివీస్ విజయం దిశగా పయనించింది. కానీ అతని నిష్క్రమణతో అంతా మారిపోయింది. జట్టు స్కోరు 158 పరుగుల వద్ద మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కోలుకోలేకపోయింది.
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
దక్షిణాఫ్రికా& పాకిస్తాన్
వేదిక: బర్మింగ్‌హామ్ ; గ్రూప్: ‘బి’
సాయంత్రం గం. 6.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం