పీటర్సన్ను బలవంతంగా సాగనంపారు!
లండన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ కెరీర్ అనూహ్యంగా ముగింపు దశకు చేరుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చర్య కెవిన్ను బలవంతంగా సాగనంపేలా చేసింది. వెస్టిండీస్ పర్యటనతో పాటు టి-20 ప్రపంచ కప్కు బోర్డు కెవిన్పై వేటు వేసింది. జట్టులో చోటు దక్కకపోవడంతో 33 ఏళ్ల పీటర్సన్ కెరీర్ కొనసాగించని పరిస్థితి ఏర్పడింది. యాషెస్ సిరీస్లో వైఫల్యం.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్కు జట్టును సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం బోర్డు, కెవిన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
'ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. జట్టుగా మేం సాధించిన విజయాలకు గర్వంగా ఉంది. అయితే నా కెరీర్ ముగింపు దశకు చేరుకున్నందుకు బాధగా ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ సాధించిన అద్భుత విజయాల్లో భాగస్వామిగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భవిష్యత్లో జట్టు విజయపథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నా. క్రికెటర్గా ఇప్పటికీ అత్యుత్తమంగా ఆడగలనని భావిస్తున్నా. క్రికెట్ ఆడుతా కానీ ఇంగ్లండ్ తరపున ఆడనందుకు విచారంగా ఉంది' అని కెవిన్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా సహచర ఆటగాళ్లను కించపరిచేలా కెవిన్ మెసేజ్లు పంపి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.
ఇంగ్లండ్ తరపున కెవిన్ 104 టెస్టులు, 136 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 8181 పరుగులు, వన్డేల్లో 4440 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా సహచర ఆటగాళ్లను కించపరిచేలా కెవిన్ మెసేజ్లు పంపి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.