మాంచెస్టర్: గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్న భారత్ ఓ వైపు... తమపై ఉన్న సంప్రదాయ ముద్రను మరిపిస్తూ పొట్టి ఫార్మాట్‌లో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరోవైపు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరానికి నేటితో తెరలేవనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ తమ తొలి టి20లో బరిలో దిగనుంది. ఐర్లాండ్‌తో పొట్టి సిరీస్‌లో కోహ్లిసేనకు విజయంతో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించగా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్ అదే జోరు ఇక్కడ కొనసాగించాలని భావిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రికార్డులు తిరగరాస్తున్న మోర్గాన్ సేనను భారత్ బౌలర్లు ఎంతవరకు నిలువరిస్తారో చూడాలి.
పూర్తిస్థాయిలో కోహ్లిసేన...
ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యర్థి బంగ్లాదేశో, అఫ్గానిస్తానో కాదు. పటిష్ట ఇంగ్లండ్. అందుకే భారత్ ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయి జట్టుతో సన్నద్ధమైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్, ధావన్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, టి20 స్పెషలిస్ట్ రైనా, సీనియర్ ధోని, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేదే ఆసక్తికరం. రాహుల్‌ను స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే పరిగణిస్తే మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జట్టులో ధోనీలాంటి వికెట్ కీపర్, అత్యుత్తమ ఫినిషర్ ఉన్న నేపథ్యంలో పాండే వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. గాయం కారణంగా బుమ్రా సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో చహర్‌ను ఎంపిక చేసినా... అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువే. భువనేశ్వర్‌తో పాటు ఉమేశ్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. స్పిన్ జోడీ చహల్, కుల్దీప్ తామి క్కడ కూడా సత్తా చాటగలమని ఐర్లాండ్ సిరీస్‌తో నిరూపించుకున్నారు. భారత్ ఆడిన గత 20 టి20ల్లో 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించి జోరు మీద ఉంది.
పటిష్ట బ్యాటింగ్‌తో ఇంగ్లండ్...
బ్యాటింగే ప్రధాన బలంగా ఇంగ్లండ్ బరిలో దిగనుంది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన మోర్గాన్ సేన ఏకైక టి20లోనూ జయభేరి మోగించింది. బట్లర్, రాయ్, బెయిర్‌స్టో, మోర్గాన్, హేల్స్, రూట్‌లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్–11 ఫామ్‌ను కొనసాగిస్తున్న బట్లర్ ఓపెనర్ అవతారం ఎత్తి జట్టు భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన అతను తొలి మ్యాచ్‌లోనే తమ దేశం తరఫున వేగవంతమైన అర్ధశతకం (22 బంతుల్లో) సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు కష్టకాలమే.
►రాత్రి గం. 10.00 నుంచి సోనీ సిక్స్, సోనీ–టెన్ 3లలో ప్రత్యక్ష ప్రసారం
తొలి సమరానికి సై
Published Tue, Jul 3 2018 12:33 AM | Last Updated on Tue, Jul 3 2018 12:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment